Sniffer Dogs to check for narcotics | మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు నిర్మల్ జిల్లా పోలీసులు వినూత్న ప్రయత్నం చేపట్టారు. గంజాయి డ్రగ్స్ ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జాగిలాలతో తనిఖీలు చేపడుతున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో శనివారం పోలీస్ జగిలాలతో జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఆదేశాలతో డిఎస్పీ గంగారెడ్డి నేతృత్వంలో నిర్మల్ రూరల్ ఇన్స్పెక్టర్ టీం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై స్పెషల్ డ్రైవ్ లు, నార్కోటిక్ జాగిలాలతో తనిఖీలు చేపడుతూ, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందన్నారు.


డ్రగ్స్ సేవించే, రవాణా చేసే వారిపై కేసులు
 
గంజాయి, డ్రగ్స్ సేవించే, రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గతంలో ఈ కేసులలో నిందితులుగా ఉన్న వారికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ తో పాటు, అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిర్మల్ జిల్లాలో మాదక ద్రవ్యాలు విక్రయించిన, సాగు చేసిన, సేవించిన, రవాణా చేసిన వారి సమాచారం తెలపాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని, కుటుంబాలు చెల్లాచెదరవుతున్నాయని, ప్రజలు సైతం తమ గ్రామాలలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం కూడా కృషి చేయాలన్నారు.


గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, అందుకోసమే నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఆదేశాలతో జిల్లాలో నార్కోటిక్ జాగిలాలతో మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఇస్పెక్టర్లు ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, ఎస్సై, లు లింబాద్రి, రవి కుమార్, జిల్లా డాగ్ స్క్వాడ్ టీం తదితరులు పాల్గొన్నారు.



Also Read: Inhuman Incident: తెలంగాణలో అమానవీయ ఘటన - ఆస్తి కోసం వివాదం, 3 రోజులుగా ఇంటి ముందే తండ్రి మృతదేహం