Son Stopped Father Funeral In Yadadri News: ప్రస్తుత కాలంలో డబ్బు మోజులో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులనే పిల్లలు నిర్లక్ష్యం చేస్తోన్న ఘటనలు మనం చూసుంటాం. కానీ, ఇక్కడ ఆస్తి కోసం ఏకంగా తండ్రి అంత్యక్రియలనే కొడుకులు నిలిపేశారు. దీంతో 3 రోజులుగా తండ్రి మృతదేహం ఇంటి ముందే శవపేటికలో ఉండిపోయింది. యాదాద్రి జిల్లాలో (Yadadri District) జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం సదర్ షాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల బాలయ్య (62), లింగమ్మ దంపతులకు నలుగురు సంతానం. బాలయ్య ఈ నెల 21న సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే, అంత్యక్రియలు చేసే క్రమంలో ఆస్తి కోసం ఇద్దరు కుమారులు నరేశ్, సురేశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.


భూమి వాటా తేల్చాలంటూ..


తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో మృతుని భార్య లింగమ్మ తన అన్న రాములుతో కలిసి 30 ఏళ్ల క్రితం మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులో అర ఎకరం భూమి విక్రయించారు. లింగమ్మకు రావాల్సిన ఒక ఎకరం 10 గుంటల భూమిని రాములు తన కుమార్తె, బాలయ్య పెద్ద కోడలు, నరేశ్ భార్య అరుణకు పట్టా చేసి ఇచ్చాడు. దీంతో చిన్న కుమారుడు సురేశ్ అభ్యంతరం తెలిపాడు. తనకు కూడా ఆ భూమిలో వాటా ఇవ్వాలని పట్టుబట్టాడు. తండ్రి అంత్యక్రియలు సైతం నిలిపేశారు. ఈ క్రమంలో బాలయ్య మృతదేహం ఇంటి ముందే 3 రోజులుగా శవపేటికలో ఉండిపోయింది. దీనిపై బంధువులు, బాలయ్య కుమార్తెలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


వారే ముందుకొచ్చి తండ్రి అంతిమ సంస్కారాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే, చిన్న కుమారుడు సురేశ్ ఆస్తి వాటా తేలే వరకూ అంత్యక్రియలు జరిపేందుకు వీలు లేదని అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో గ్రామపెద్దలు కలుగచేసుకుని.. అన్నదమ్ములిద్దరినీ కూర్చోబెట్టి నచ్చచెప్పారు. సమస్య పరిష్కరించడంతో బాలయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే, తండ్రి చనిపోతే చిన్న కుమారుడు వ్యవహరించిన తీరు సరికాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఏపీలో భూమి కోసం దారుణం


అటు, ఏపీలోని ఏలూరు జిల్లాలోనూ భూమి కోసం దారుణం జరిగింది. మండవల్లి మండలం గన్నవరంలో తల్లీ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించి రొయ్యూరు భ్రమరాంబ, ఆమె కుమారుడు నరేష్‌లను కత్తులు, గొడ్డళ్లతో దారుణంగా నరికి చంపారు. శనివారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెళ్లి చూడగా ఇద్దరూ హత్యకు గురి కావడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్తి, భూమి తగాదాలే ఈ హత్యలకు కారణంగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హత్యకు గురైన సురేశ్ ఐటీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. జంట హత్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన నెలకొంది.


Also Read: Crime News: గుర్తు తెలియని యువతి నుంచి వీడియో కాల్ - కూల్‌గా మాట్లాడి కొంపముంచింది, చివరకు!