Maharashtra Assembly Election 2024 |  మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి కూటమి అఖండ విజయం సాధించింది. ఈ విజయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాత్రను తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. పవన్ ప్రచారం చేసిన షోలాపూర్, పూణే, లాతూర్, బల్లార్ పూర్, కసబపేట్, డేగులూర్, భోకర్ లాంటి చోట్ల అధిక స్థానంలో బిజెపి కూటమి గెలుపొందింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినచోట చాలా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా  జన సమీకరణ జరిగింది. మరాటా గడ్డపై  తెలుగు ప్రజల  సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల  పవన్ పూర్తి స్థాయిలో తన హవా చూపించగలిగారు. దీనితో తెలుగు రాష్ట్రాలకు అవతల పవన్ చరిష్మా పై బిజెపిలో ఎవరికైనా  సందేహాల్లాంటివి ఉంటే అవన్నీ  మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్  మహారాష్ట్ర మొదలుకుని కింద ఉన్న దక్షిణాది రాష్ట్రాలలో బిజెపి ప్రధాన ప్రచార అస్త్రంగా పరిస్థితి. మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో  పవన్ చరిష్మా ను వాడకుని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బిజెపి పెద్దలు రెడీ అవుతున్నారు. వారి కళ్ళ ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ "తమిళనాడు"


తమిళ నాట బిజెపి ప్రధాన అస్త్రం పవన్ కళ్యాణే


మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. బిజెపి కు సంఘపరివార్ కు తమిళనాడు ఎప్పుడూ  కొరకని కొయ్యే. డీఎంకే, అన్నా డీఎంకే మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సోలోగా బీజేపీ బలపడడానికి తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వలేదు. ద్రవిడ ఉద్యమాలకు పుట్టిల్లు అయిన తమిళనాడులో బీజేపీ మత ఆధారిత రాజకీయాలు చెల్లుబాటు కాలేదు. రాజకీయ దిగ్గజాలు కరుణానిధి, జయలలితల అస్తమయం తరువాత పరిస్థితులు కొంత సడలాయి. దానితో వచ్చే ఎన్నికల్లో బిజెపి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లో ప్రభావం చూపడానికి  శతవిధాల ప్రయత్నిస్తోంది. ఒకవైపు రాజకీయం గా బలంగా ఉన్న స్టాలిన్, ఉదయనిధులకు తోడు తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కూడా  సొంత పార్టీతో రంగంలోకి దిగుతున్నారు. అన్నా డింఏంకే తో పొత్తుతో  అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బిజెపి భావిస్తున్నా ఆ వర్గంలో స్టార్ పవర్ బిజెపికి కనిపించడం లేదు.


తమిళనాడు అసెంబ్లీలో 234 సీట్లు ఉన్నాయి. అక్కడ విజయానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్  118. గత ఎన్నికల్లో డీఎంకే పార్టీ సోలోగా 133 సాధించింది. అంత బలంగా ఉన్న డీఎంకేను ఢీకొట్టడం అంత సామాన్యమైన పని కాదు. అంగ, ఆర్థిక బలాలతో పాటుగా సినీ గ్లామర్ కు పెట్టింది పేరైన తమిళ రాజకీయాల్లో స్టార్ పవర్ కూడా కావాల్సిందే.అలాంటి సమయం లో వారికి కనిపిస్తున్న ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే తిరుపతి లడ్డు వ్యవహారాన్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ను ఇప్పటికే తమిళ రాజకీయాలకు పరిచయం చేసింది. సనాతన ధర్మం బేస్ చేసుకుని  పవన్ చేసిన తమిళ రాజకీయ ప్రసంగాలు, ఉదయనిధి స్టాలిన్ ను టార్గెట్ చేస్తూ ఇచ్చిన స్టేట్మెంట్లు తమిళనాట బాగా వైరల్ అయ్యాయి. ఈలోపు మహారాష్ట్ర ప్రయోగం కూడా  సూపర్ సక్సెస్ కావడంతో పవన్ను తమిళనాడు లో కూడా బలంగా ఆడడానికి బిజెపి పెద్దలు రెడీ అయిపోయారు. అయితే అది కేవలం ప్రచారపరంగానే  మాత్రమేనా లేక తమిళనాడు అసెంబ్లీలో జనసేన ను కూడా పోటీలో దింపేంత వరకా అనేది తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.