నిజామాబాద్ జిల్లా బోధన్‌ ప్రాంతాన్ని రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. రైళ్లు నిలిపివేయటంతో బోధన్‌ ప్రాంత వాసులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా అభివృద్ధిలోనూ వెనుకబడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బోధన్‌ ప్రాంతానికి కొత్త రైళ్లు రావు.. ఉన్న వాటిని రద్దు చేస్తారు అన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. రైల్వేశాఖకు వివిధ రూపాల్లో కోట్ల రూపాయాల ఆదాయం వస్తున్నా బోధన్‌ ప్రాంతంపై మాత్రం చిన్నచూపు చూస్తూనే ఉంది. పాలకుల నిర్లక్ష్యం.. రైల్వేశాఖ శీతకన్ను బోధన్‌ ప్రాంత వాసులకు రైళ్ల కలలను దూరం చేస్తున్నాయి. బోధన్‌ ప్రాంతానికి రైల్వేశాఖ సేవలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. కొత్త రైళ్ల సంగతి దేవుడెరుగు.. పాత రైళ్లను సైతం రద్దు చేయడంతో బోధన్‌ ప్రాంత ప్రజలు రైల్వేశాఖ తీరుపై మండిపడుతున్నారు.


ఎడపల్లి, శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ల మూసివేత


నిత్యం వేల మంది బోధన్‌ రైల్వే మార్గం ద్వారా రాకపోకలు సాగిస్తుండగా.. కరోనా ప్రభావంతో రద్దు అయిన రైళ్లు ప్రారంభించకపోగా.. పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు కసరత్తు చేస్తోంది ఆ శాఖ. ప్రతినెలా అధికంగా ఆదాయం ఉన్న రైళ్లను నడిపేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రతినెలా కేవలం గూడ్స్‌ రైళ్ల ద్వారానే సుమారు 3 కోట్ల రూపాయల వరకు రైల్వేశాఖకు ఆదాయం సమకూరుతోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.30 కోట్ల ఆదాయం వస్తోంది. అయినప్పటికీ రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత ఆదాయం ఉన్నా ప్యాసింజర్‌ రైళ్లను నడపకపోవడంతో ప్రజలు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. నడుస్తున్న రైళ్లను రద్దు చేయడంతో పాటు ఎడపల్లి, శక్కర్‌నగర్‌ రైల్వే స్టేషన్లను మూసివేశారు. సౌకర్యాలను మెరుగుపర్చాల్సింది పోయి ఉన్న స్టేషన్లను మూసి వేయడం, రైళ్లను రద్దు చేయడం ఆ శాఖ నిర్లక్ష్యానికి పరకాష్టగా నిలుస్తోంది. 


ఆందోళనలు చేసినా పట్టించుకోని వైనం


బోధన్‌ ప్రాంతానికి రైళ్లను నడపాలని, సౌకర్యాలను మెరుగుపర్చాలని యువత ఆందోళనలు కూడా చేసింది. తనిఖీకి వచ్చే రైల్వేశాఖ ఉన్నతాధికారులకు యువకులు పలుమార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మహబూబ్‌నగర్‌, మిర్జాపల్లికి నడిచే రైళ్లను తిరిగి ప్రారంభించాలన్న డిమాండ్‌ను రైల్వేశాఖ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. రైల్వేశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నా.. స్థానిక నేతలు నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


నష్టం లేకున్నా.. మూసేశారు!


నిత్యం వేల మంది ప్యాసింజర్ల రైళ్ల ద్వారా రాకపోకలు సాగించడంతో రైల్వేశాఖకు మంచి ఆదాయం వస్తోంది. అలాగే గూడ్స్‌ రైళ్ల ద్వారా 3 కోట్ల వరకు ఆదాయం వస్తున్నా.. ప్రజలకు రైల్వే సేవలను దూరం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. మంచి రైల్వే మార్గంతో ఉన్నా.. సేవలను రద్దు చేయడం పట్ల బోధన్‌ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోధన్‌ ప్రాంతం నుంచి ఆదాయం బాగానే ఉన్నా.. స్టేషన్లను మూసి వేయడం, రైళ్లను రద్దు చేయడం సరికాదని బోధన్‌ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా రైళ్లను పునరుద్ధరించడంతో పాటు సేవలను మెరుగుపర్చాలని కోరుతున్నారు.


Also Read: దేవుడా.. ఓ మంచి దేవుడా.. దయచేసి కొత్త వేరియంట్‌ను నా రాష్ట్రానికి రానివ్వకు'


Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?


Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?


Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి