కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిండా ముంచుతున్నాయన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వం రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లిలో జరిగిన రైతు సదస్సులో పాల్గొన్న రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలపై ఫైరయ్యారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. అందుకే రైతులను అన్ని రకాలుగా ఆదుకోడానికి వరంగల్ లో కాంగ్రెస్ అగ్రేనేత రాహుల్ గాంధీ సమక్షంలో రైతు డిక్లరేషన్ చేయించామన్నారు. రైతులకు మేలు చేసే విధంగా ఒప్పందం చేసుకున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. చిత్తశుద్ధితో, నిబద్ధతతో వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు మేలు చేస్తామని చెప్పారు. 
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అప్పుల పాలైన రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పాం. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి కుటుంబానికి ఏటా రూ.12 వేలు ఉచితంగాఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 నెలల్లో నిజాంషుగర్ ప్యాక్టరీని తెరిపిస్తాం.. పసుపు బోర్డు నెలకొల్పుతాం. పంట బీమా అమలు చేస్తాం. కౌలు రైతులకు, రైతులకు హెల్త్ కార్డుతో పాటు రైతు బీమా పథకం అమలు చేస్తామన్నారు’ రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఫసల్ బీమా పథకం, పంట బీమా పథకం లేకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 5 కిలోల చొప్పున తరుగు తీస్తోంది. కొన్న పంటకు కూడా త్వరగా డబ్బులు చెల్లించటం లేదు. ధాన్యం కొన్న తర్వాత 3 నెలలకు డబ్బులు చెల్లిస్తున్నారు. రైతుల సమస్యలను తెలుసుకోవటానికి శాశ్వత పరిష్కారం కోసం రైతు కమిషన్ ఏర్పాటు చేస్తామని.. 24 గంటలు ఏ సమస్య వచ్చినా రైతు కమిషన్ కు ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. రైతుల పట్ల ఎవరు తప్పుచేసినా రైతు కమిషన్ చర్యలు తీసుకుంటుందని, దీని వల్ల అన్నదాతలకు మేలు జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి.  


ఏ పంటను వేయకుండా చేస్తున్న సీఎం!
ప్రత్యామ్నాయ పంటల వైపు చూడాలంటూ సీఎం కేసీఆర్ ఏ పంటనూ వేయకుండా చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్రంలో వరి పండిస్తే రైతుకు ఉరేసుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. ప్రత్యామ్నయ పంటలు చూసుకోవాలంటు కేసీఆర్ చెబుతున్నారు. దీంతో తెలంగాణలో రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటించే పరిస్థితులు వస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఆదాని, అంబానీలకు దారాదత్తం చేస్తున్నాడు ప్రధాని మోదీ. ఎయిర్ ఇండియా నుంచి ఎయిర్ పోర్టుల వరకు ఇద్దరు గుజరాతీ పెట్టుబడి దారులకు అమ్మేస్తున్నారు మోదీ. గుజరాత్ మోడల్ అంటే ఇద్దరు అమ్మేటోళ్లు, ఇద్దరు కొనేటోళ్లని అన్నారు రేవంత్ రెడ్డి. 
ఇదేనా తెలంగాణ మోడల్?
తెలంగాణ మోడల్ అంటే 3 వేల వైన్స్ షాపులు, 6 వేల బెల్ట్ షాపులని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. సోయా, మొక్కజోన్న, పసుపును రైతులు మార్కెట్ కు తీసుకెళ్తే గిట్టుబాటు ధర రాక వారిని పీల్చి పిప్పి చేస్తున్నాడు కేసీఆర్. గతంలో రైతులకు సబ్సిడీ వచ్చేది. పంటలు నష్టపోతే ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేవాళ్లం. అలా ఎకరాకు రైతులకు రూ. 30 నుంచి 40 వేలు వచ్చేవి. రైతు బంధు పేరుతో ఈ పథకాలన్నీ నిలిపివేశాki సీఎం కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో చెరుకు పండించేవారు రైతులు. కానీ సీఎం కేసీఆర్ నిజాంసాగర్ షుగర్ ఫ్యాక్టరీని మూసేయించటంతో చెరుకు పండించే వారే కరువయ్యారని అన్నారు రేవంత్. 


మరో వైపు ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల్లో బాండ్ పేపర్ రాసిచ్చారు. కానీ పసుపు బోర్డు అంటే స్పైసిస్ బోర్డు తీసుకొచ్చారు. అరవింద్ ఎందుకు పసుపు బోర్డు తేవట్లేదో అర్థం కావట్లేదన్నారు రేవంత్. బీఆర్ఎస్ మీద కోపంతో బీజేపీ వైపు చూడొద్దు... బతుకులు ఆగమవుతాయి. రైతులకు రుణమాఫి, పంటకు మద్దతు ధర, ఎర్రజోన్నలకు గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నది కాంగ్రెస్ పార్టీ. రైతులు, పేద వారు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య బీమా పథకం తీసుకొచ్చింది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రైతులను రాజులను చేసింది. 2014 నుంచి 2023 వరకు రైతులను కేసీఆర్ ప్రభుత్వం పీల్చి పిప్పి చేసిందని అన్నారు రేవంత్ రెడ్డి. ఆర్మూర్ లో 2021 జనవరి 31న జరిగిన రైతు సదస్సు వల్లే ఇవాళ తాను టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి ఆనాడు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది. 


రాబోయే రోజుల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఉచితంగా ఇస్తామని చెప్పారు రేవంత్. ప్రతి పేదవాడికి రూ. 5 లక్షల మేర ఉచిత వైద్యం అందిస్తాం. ఆడ బిడ్డల కన్నీళ్లు తుడిచేందుకు రూ. 1,200 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ. 500 లకే ఇస్తామన్నారు. ఇవాళ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఉద్యోగాల భర్తీ చేస్తాం. పసుపు క్వింటాకు రూ. 12, 000లకు కొంటాం. చెరుకు రూ. 4 వేలకు కొనుగోలు చేస్తాం. సోయా బీన్ రూ.4,400 కొంటాం, వరి రూ. 2,500 కొంటాం.. ఎర్రజోన్నరూ. 3, 500 కొంటాం. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో రూ. 2,660 లకు వడ్లను కొంటున్నాం. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయం కోసం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాబోయే పది రోజులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా యాత్రలో ఉంటా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.