Telangana Liberation Day: నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత సంబరాలు అట్టహాసంగా జరిగాయి. వజ్రోత్సవాల ప్రారంభోత్సవ సూచికగా జరుపుకుంటున్న వేడుకలు అయినందున జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. 


మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పుర ప్రముఖులకు, ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలియజేశారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 


ఈ వేడుకకు రాష్ట్ర రోడ్లు- భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొంటే.. జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీ.గంగాధర్ గౌడ్, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు హాజరయ్యారు.


ఈ నేల శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలి


జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాగ్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణలో మతతత్వ శక్తులు తమ వికృత ప్రయత్నాలతో రాష్ట్ర సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన తెలంగాణ సమైక్యత దిన వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. సమాజంలో తమ చుట్టూ జరుగుతున్న పరిణామాలను గ్రహించి అందరూ ముందడుగు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏ మాత్రం ఆదమరిచినా బాధాకరమైన సందర్భాలు ఎదురవుతాయని అన్నారు. ఒకసారి జరిగిన ఏమరుపాటు వల్ల 58 ఏళ్లు శాపగ్రస్త జీవితం అనుభవించామని అన్నారు. ఆ అస్తిత్వం నిలుపుకోవడానికి ఎన్నో త్యాగాలు చేశామని, తెలంగాణ ఉద్యమం చేశారని అన్నారు. ఆ ఉద్యమ ఘర్షణను తలచుకుంటే తన కళ్లలో నీళ్లు తిరుగుతాయని అన్నారు. అలాంటి వేదన మళ్లీ ఎదురు కాకూడదని అన్నారు. సంకుచిత స్వార్థ ప్రయోజనాల కోసం కొంత మంది ముళ్ల కంపలు నాటుతున్నారని అన్నారు. విద్వేష మంటలు రగిలిస్తూ విష వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మనుషుల మధ్య ఈ విభజన ఏ విధంగానూ సమర్థనీయం కాదని అన్నారు.