ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చిపట్టుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఇప్పటికే ఎయిర్ పోర్టులు, పోర్టులను మోదీ ప్రైవేటుపరం చేశారని.. సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటు వారికి అప్పగించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తిడి తెస్తున్నారని, తాను చచ్చినా రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోనని కేంద్రానికి తేల్చి చెప్పినట్లుగా కేసీఆర్ వివరించారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం మనకు ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వలేదని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో కేసీఆర్ ప్రసంగించారు.
ఇంకో అవకాశం ఎందుకు?
అటు కాంగ్రెస్ నేతలు కూడా ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఏది మాట్లాడినా నడిచిపోతుందని నేతలు భావిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏమరుపాటుగా ఉండి కనుక ఓటు వేస్తే.. మన భవిష్యత్తు ఆగం ఆగం అవుతుందని హెచ్చరించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి అయినప్పటికీ.. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పెరగలేదని కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 75 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఒక్క అవకాశం ఇవ్వమని మళ్లీ అడుగుతోందని అన్నారు. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం కాదు.. 11 అవకాశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇన్నేళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందో ఆలోచించాలని అన్నారు.
రైతులకు మేలు చేస్తున్నామని, నష్టం వచ్చినా వరి, జొన్న వంటి పంటలు కొంటున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన వారంలోనే రైతులకు డబ్బులు ఖాతాల్లో వేస్తున్నామని చెప్పారు. మరోవైపు, ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయని.. ధరణి వల్ల భూముల రిజిస్ట్రేషన్లలో దళారులు లేకుండా పోయారని చెప్పారు. రైతుల కోసం ఎవరూ అడగకుండానే రైతుబంధు తీసుకొచ్చానని అన్నారు. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల వరి పండుతోందని.. మిగతా ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం చక్కగా పండుతుందని చెప్పారు. దేశంలో 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉంటే.. వారికి పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. దళితబంధు పథకం తన మానసపుత్రిక అనీ, మాజీ ప్రధాని నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే.. ఎస్సీల జీవితాలు ఎప్పుడో మారిపోయేవని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
అది పూర్తయితే అస్సలు కరెంటు సమస్య ఉండదు
యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయితే ఇక తెలంగాణలో ఎప్పటికీ కరెంటు సమస్య ఉండబోదని అన్నారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని సీఎం చెప్పారు. దేశంలో తెలంగాణ మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తోందని.. చిన్న రాష్ట్రమైనా తెలంగాణ ఇవాళ తలసరి విద్యుత్ వినియోగంలో ముందుందని కేసీఆర్ అన్నారు.