Telangana Elections Latest News: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఎన్నికల సంఘం గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాల్లో 5 గంటల వరకూ పౌరులు ఓటు వేసే అవకాశం ఉంటుంది. కేవలం 13 ప్రాంతాల వారికి మాత్రం సాయంత్రం 4 గంటల వరకే ఓటు వేసే అవకాశం ఉంటుంది. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆ ప్రకారం.. ఈ ప్రాంతాల్లో మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. 4 గంటలలోపు క్యూలో ఉన్నవారిని ఓటు వేయడానికి అధికారులు అనుమతిస్తున్నారు.


మంథనిలో ముగిసిన పోలింగ్ - భారీ భద్రత నడుమ ఈవీఎంల తరలింపు



పెద్దపల్లి జిల్లా మంథనిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సమస్యాత్మక ప్రాంతం కావడంతో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియగా, 4 గంటల లోపు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. మంథనిలో 288 పోలింగ్ స్టేషన్స్ ఉండగా, 2,36,442 మంది ఓటర్లున్నారు. మొత్తం 82 శాతం పోలింగ్ నమోదు కాగా 21 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాగా గత ఎన్నికల్లో 85.14 శాతం పోలింగ్ నమోదైంది. భారీ భద్రత నడుమ ఈవీఎంలను పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని జేఎన్టీయూ కాలేజీ స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు.


మధ్యాహ్నం 3 గంటల వరకూ 51.89 శాతం పోలింగ్ - జిల్లాల వారీగా పోలింగ్ వివరాలు



రాష్ట్రంలో 3 గంటల వరకూ 51.89 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ లో 31.17 శాతం నమోదైనట్లు చెప్పారు. ఆదిలాబాద్ 62.3, భద్రాద్రి 58.3, హన్మకొండ 49, హైదరాబాద్ 31.17, జగిత్యాల 58.6, జనగాం 62.2, భూపాలపల్లి 64.3, గద్వాల్ 64.4, కామారెడ్డి 59, కరీంనగర్ 56, ఆసిఫాబాద్ 59.62, మహబూబాబాద్ 65.05, ఖమ్మం 63.6, మహబూబ్ నగర్ 58.8, మంచిర్యాల 59.1, మేడ్చల్ 38.2, ములుగు 67.8, నాగర్ కర్నూల్ 57.5, నల్గొండ 59.9, నారాయణపేట 57.1, నిజామాబాద్ 56.5, నిర్మల్ 60.3, పెద్దపల్లి 59.2, సిరిసిల్ల 56.6, రంగారెడ్డి 42.4, సంగారెడ్డి 56.23, సిద్దిపేట 64.9, సూర్యాపేట 62.07, వికారాబాద్ 57.6, వనపర్తి 60, వరంగల్ 52.2, యాదాద్రి 64 శాతంగా పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. కాగా, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తి కానుంది.