కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడకు రాజకీయ రంగు అంటుకుంది. నిన్న(శుక్రవారం) రైతులు పిలుపునిచ్చిన బంద్‌కు ప్రతిపక్షాల మద్దతు ఇవ్వడంతో కామారెడ్డి కాకరేగింది. సాయంత్రానికి అంతా సైలెంట్ అయిపోయిందనుకున్న టైంలో బండి సంజయ్ పర్యటన అర్థరాత్రి వరకు హైడ్రామా నడిచింది. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే్నాయి.
మాస్టర్ ప్లాన్‌లో భూమి పోతుందన్న ఆందోళనతో పయ్యావులు రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పరామర్శించారు. అక్కడే నాటీకయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాములుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యని బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వం న్యాయం చేసే వరకు కామారెడ్డి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకొని కూర్చుకున్నారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రశాంతంగా ఉన్న కామారెడ్డి ఒక్కసారిగా భగ్గుమంది. పార్ట శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. పోలీసులు పెట్టిన బారికేడ్లు తొలగించుకొని లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే కలెక్టర్ వచ్చి దీనిపై సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
బండి సంజయ్‌తోపాటు బీజేపీ శ్రేణుల ముట్టడిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. సుమారు గంట, గంటన్నరపాటు హైడ్రామా నడిచింది. చివరకు బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆయన ఉన్న వాహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. వాహనాలను ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. అతికష్టమ్మీద బండి సంజయ్‌ను అక్కడి నుంచి తరలించారు. ఆయన్ని హైదరాబాద్ తరలించారు.
రాములు కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రి కాదని... రియల్ ఎస్టేట్ మంత్రి అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా తన బాధ్యత మర్చిపోయారని ఇది పద్దతి కాదని హెచ్చరించారు. తెలంగాణలో చాలా మంది ఉన్నతాధికారులు ప్రభుత్వంతో కుమ్మక్కై పని చేస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డిలో రైతుల అభిప్రాయాలను తెలుసుకోకుండా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చారని... ఇది కచ్చితంగా రైతులను ముంచే ప్లానే తప్ప వారికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.