జాతీయ స్థాయిలో కీలక నేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు సైతం విచారణ నిమిత్తం ఈడీ ఆఫీసుకు వెళ్లారని, కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో భిన్నంగా వ్యవస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సీఎం కూతురైన కవితను సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు ఇంట్లో విచారణ చేయడానికి సిద్ధం కావడంపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ రమణని ఒక విధంగా, మరో ఎమ్మెల్సీ కవితను ఇంట్లో విచారణ చేస్తూ, మరో విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. సోనియా, రాహుల్ లాంటి వ్యక్తులు నేరుగా ఆఫీసులకు వెళ్లి విచారణకు సహకరించగా, ఎమ్మెల్సీ కవిత విచారణను గమనిస్తే.. సీబీఐ విచారణ సరిగా లేదని ప్రజలకు అర్థమైందన్నారు.
ఎంత పెద్ద వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్, ఈడీ ఆఫీసు, సీబీఐ ఆఫీసుకు పిలిచి విచారణ చేశారని జీవన్ రెడ్డి అన్నారు. అదే పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ రమణను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ చేపట్టగా, కవితను ఎందుకు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారని ప్రశ్నించారు. కవితని ఇంట్లో విచారణ చేస్తామని ప్రకటించడం విడ్డురంగా ఉందదన్నారు. సీఎం కూతురు కవితపై విచారణలో అధికారుల తీరు సరిగా లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి చర్యలతో విచారణ సంస్థలపై పార్టీలతో పాటు ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.
మొదట ఈడీ రిపోర్టులో పేరు, తాజాగా కవితకు సీబీఐ నోటీసులు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. దిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు చేర్చారు. తాజాగా సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ లో కవిత వివరణ తీసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో తెలిపింది. దిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ చెప్పింది. ఈ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 ప్రకారం CBI నోటీసులు జారీచేసింది.
విచారణ విషయంలో సీబీఐ ఎమ్మెల్సీ కవితకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. తామే వచ్చి ప్రశ్నిస్తామని ఢిల్లీలోనా హైదరాబాద్‌లోనా అన్నది మీ ఇష్టమని ఎమ్మెల్సీ కవితకు చాయిస్ ఇచ్చారు. వెంటనే కవిత తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే వివరాలు తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చానని ప్రకటించారు. అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏమిటంటే.. హైదరాబాద్‌లో సీబీఐ ఎంట్రీకి ఎప్పుడో రెడ్ సిగ్నల్ వేశారు. జనరల్ కన్సెంట్ రద్దు చేశారు. మరి ఇప్పుడు సీబీఐ తెలంగాణలోకి ఎలా ఎంట్రీ ఇస్తుంది ?
సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం !
తెలంగాణ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వాల్సిన ‘సాధారణ సమ్మతి’ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 30నే ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ జీవో ప్రకారం ఇకపై రాష్ట్రంలో సీబీఐ ఏ కేసు విషయంలో రాష్ట్రంలో దర్యాప్తు జరపాలన్నా ముందుగా ఆ వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం ఇచ్చే అనుమతి మేరకే సీబీఐ కేసు దర్యాప్తులో ముందుకెళ్లాల్సి వస్తుంది. దేశరాజధాని ఢిల్లీ మినహా ఏ రాష్ట్రంలో సీబీఐ తన అధికారాల్ని వినియోగించుకోవాలన్నా ఆ రాష్ట్రం సాధారణ సమ్మతి తెలపాల్సి ఉంటుంది. రాష్ట్రాల సాధారణ సమ్మతి లేకుంటే మాత్రం.. ఏ రాష్ట్రంలోనూ సీబీఐ నేరుగా వెళ్లి దర్యాప్తు చేసేందుకు వీలులేదు.