Minister Harish Rao : వారం, పది రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కామారెడ్డి సహా 9 జిల్లాల్లో 1.24 లక్షల మంది గర్భిణీలకు అందజేస్తామన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్స్, పుట్టక ముందు న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా బిచ్ కుందలో డయాలిసిస్ సెంటర్ ను మంత్రి హరీశ్ రావు శనివారం ప్రారంభించారు. కిడ్నీ సమస్యలు ఉన్న వారు వారానికి రెండు మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. పేద వారికి ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు కేవలం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రిలో మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం ఇలా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా.. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం 3 నుంచి 83కు పెంచిందని అన్నారు మంత్రి హరీశ్ రావు. వీటి సంఖ్య 102కు పెంచాల్సి ఉందన్నారు. 


కిడ్నీ రోగులకు ఏడాది రూ.100 కోట్లు ఖర్చు 


దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా సింగిల్ యూజుడ్ ఫిల్టర్ ను ఉపయోగించి డయాలసిస్ చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.  డయాలసిస్‌ రోగులకు ఆసరా పింఛన్, ఉచిత బస్‌ పాస్‌ కూడా ఇస్తున్నామని అన్నారు. ఏటా 150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయన్నారు. ట్రాన్స్‌ప్లాంటేషన్‌ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా జీవిత కాలం అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 12 వేల మంది డయాలసిస్‌ చేయించుకుంటున్నారని, వారిలో 10 వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్‌ చేయిస్తోందన్నారు. డయాలసిస్‌ రోగులకు పింఛను ఇస్తున్నామన్నారు. కిడ్నీ రోగుల కోసం ఏడాదికి రూ.100 కోట్లు ఖర్చు చేసున్నామని తెలిపారు. 
 
గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ 


రాష్ట్ర విభజన తర్వాత సుమారు రూ.700 కోట్లు కిడ్నీ రోగుల కోసం ఖర్చు చేశామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 49.8 లక్షల డయాలిసిస్ సెషన్స్ చేశామన్నారు. వచ్చే వారంలో 50 లక్షల సెషన్స్ లు పూర్తి అవుతాయన్నారు. గ‌ర్భిణీగా ఉన్నప్పుడు న్యూట్రిష‌న్ కిట్‌, బాలింతగా మారిన‌ప్పుడు కేసీఆర్ కిట్‌ అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ కిట్ విప్లవాత్మక‌మైన మార్పు తీసుకురావ‌డంతో ఇదే స్ఫూర్తితో మ‌హిళ‌ల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్ తీసుకురాబోతున్నారని తెలిపారు హరీష్ రావు. అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న 9 జిల్లాలు ఆదిలాబాద్‌, భ‌ద్రాద్రి కొత్తగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, జోగులాంబ గ‌ద్వాల్‌, కామారెడ్డి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, నాగ‌ర్ క‌ర్నూల్‌, వికారాబాద్ ల‌లో ఈ కిట్ ప్రవేశ పెడుతున్నామన్నారు.  మొత్తం 1.24 ల‌క్షల మంది గ‌ర్భిణీల‌కు ఉప‌యోగ‌ప‌డుతుందన్నారు. ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్ ల‌ను పోష‌కాహారం ద్వారా అందించి ర‌క్త హీన‌త త‌గ్గించ‌డం, హీమోగ్లోబిన్ శాతం పెంచ‌డం దీని ల‌క్ష్యమన్నారు హరీశ్ రావు.