Umran Malik To Replace Injured Mohammed Shami:


బంగ్లా సిరీసుకు ముందు టీమ్‌ఇండియాకు షాక్‌! సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి గాయపడ్డాడు. బంగ్లా టైగర్స్‌తో వన్డే సిరీసుకు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో జమ్ము కశ్మీర్‌ స్పీడ్‌స్టర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఎంపికయ్యాడు. ప్రస్తుతం షమీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్నాడు.


ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన షమి ట్రైనింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడని తెలిసింది. అతడు భుజం నొప్పితో బాధపడుతున్నాడని సమాచారం. టీ20 ప్రపంచకప్‌ నిష్క్రమణ తర్వాత సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు. బంగ్లా సిరీసుకు ఎంపికవ్వడంతో అతడు తిరిగి బంతితో సాధన మొదలుపెట్టాడు. ఇంతలోనే ఇలా జరిగింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రెండు మ్యాచుల టెస్టు సిరీసుకూ అతడు అందుబాటులో ఉండకపోవచ్చని అంటున్నారు.


న్యూజిలాండ్‌ సిరీసులో ఉమ్రాన్‌ మాలిక్‌ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. మునుపటితో పోలిస్తే అతడి బౌలింగ్‌లో పరిణతి కనిపిస్తోంది. దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని వికెట్లు పడగొడుతున్నాడు. ప్రస్తుతం భారత్‌-ఏ జట్టు బంగ్లాదేశ్‌లో షాడో టూర్‌లో ఉంది. యువ పేసర్లు నవదీప్‌ సైని, ముకేశ్ కుమార్‌ బంతితో రాణిస్తున్నారు. తొలి నాలుగు రోజుల మ్యాచులో సైని 4, ముకేశ్ 3 వికెట్లు సాధించారు.


టెస్టు సిరీసుకు మహ్మద్‌ షమి గనక అందుబాటులో లేకుంటే సైని, ముకేశ్‌లో ఒకరికి అవకాశం దొరకొచ్చు. ముకేశ్‌ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడలేదు. 2020-21లో సైని టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాపై రాణించాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా సైతం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సెప్టెంబర్లో అతడి మోకాలి శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. దాంతో టెస్టుల్లో ఆడటంపై సందిగ్ధం నెలకొంది. బహుశా ఇండియా-ఏ ఆటగాడు సౌరభ్ కుమార్‌ను ఆడించొచ్చు.


Also Read: ఐపీఎల్ 2023 మినీ వేలం- ఈ ముగ్గురు కీలక ఆటగాళ్ల దూరం!


Also Read: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!


భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 4న జరగనుంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 7న జరగనుంది. అదే సమయంలో ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ డిసెంబర్ 10న జరగనుంది. ఈ సిరీస్‌ మొత్తం మూడు మ్యాచ్‌లు మీర్పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతాయి. దీంతో పాటు ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టు సిరీస్ లో చివరి మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఢాకాలో జరగనుంది


బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు


భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, ఎమ్.డి. సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాళ్.