Gurtunda Seetakalam Trailer : లవ్‌లో సత్యదేవ్ హెలికాప్టర్ షాట్ - ష్యూర్‌షాట్ హిట్‌లా ఉందిగా
సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన ప్రేమకథా చిత్రం 'గుర్తుందా శీతాకాలం'. ఈ నెల 9న సినిమా విడుదల అవుతోంది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు.
సత్యదేవ్ (Satyadev) కథానాయకుడిగా నటించిన చిత్రం 'గుర్తుందా శీతాకాలం' (Gurthunda Seethakalam Movie). హీరోగా, నటుడిగా తెలుగు, హిందీ ప్రేక్షకులకు ఆయన తెలుసు. ఫర్ ద ఫస్ట్ టైమ్... ఆయన ఓ లవ్ స్టోరీ చేశారు. సారీ... లవ్ స్టోరీలు ఉన్న సినిమా చేశారు. అదే ఈ 'గుర్తుందా శీతాకాలం'. ఇందులో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకులు. ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సమర్పణలో భావన రవి, రామారావు చింతపల్లితో కలిసి ఆయన సినిమాను నిర్మించారు. సత్యదేవ్ సరసన పాన్ ఇండియా స్టార్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. ఆమెతో పాటు మేఘా ఆకాష్ (Megha Akash), కావ్యా శెట్టి (Kavya Shetty) కూడా ఉన్నారు. సత్యదేవ్ స్నేహితుడిగా ప్రియదర్శి (Priyadarshi Pulikonda) కీలక పాత్రలో కనిపించనున్నారు. డిసెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
Gurthunda Seethakalam Trailer Review : 'గుర్తుందా శీతాకాలం' ట్రైలర్ విషయానికి వస్తే... స్కూల్‌లో, కాలేజీలో, ఆ తర్వాత, ట్రావెలింగ్‌లో - హీరో జీవితంలో నాలుగు దశలలో ప్రేమను చూపించారు. 'నీ అంత క్లాస్ ఫిగర్‌ను పడేస్తానని అనుకోలేదు', 'గురూజీ... నమస్కారం' అంటూ కాలేజీ లవ్ స్టోరీలో సత్యదేవ్ చెప్పే డైలాగులు యువతను ఆకట్టుకోవడం ఖాయం.
తమన్నా, సత్యదేవ్ మధ్య కెమిస్ట్రీ బావుంది. అదొక ఎమోషనల్ లవ్ స్టోరీలా ఉంది. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి. అన్నిటికంటే ఎంఎస్ ధోనిలా సత్యదేవ్ కొట్టిన హెలికాప్టర్ షాట్ ట్రైలర్‌లో హైలైట్. ఆ షాట్‌లా ఈ సినిమా కూడా ష్యూర్‌షాట్ హిట్ అని చెప్పేలా ట్రైలర్ ఉంది. 'ప్రేమించడం అంటే మనకు ఇష్టమైన వాళ్ళ కోసం ఇష్టమైనది చేయడమే కదా' అని ట్రైలర్ చివర్లో సత్యదేవ్ చెప్పే మాట అందరికీ కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.
Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?
సత్యదేవ్‌కు ఈ సంవత్సరం ఐదో రిలీజ్ ఇది. 'గాడ్ ఫాదర్', 'రామ్ సేతు' కంటే ముందు 'ఆచార్య'లో అతిథి పాత్ర చేశారు. 'గాడ్ సే'లో హీరోగా నటించారు. అటు తమన్నాకూ ఐదో రిలీజ్ కావడం విశేషం. వరుణ్ తేజ్ 'గని'లో స్పెషల్ సాంగ్ చేసిన ఆవిడ... 'ఎఫ్ 3'లో వెంకట్జ్ జోడీగా కనిపించారు. హిందీలో 'బబ్లీ బౌన్సర్', 'ప్లాన్ ఎ ప్లాన్ బి' సినిమాలు చేశారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు 'గుర్తుందా శీతాకాలం'తో మరోసారి కథానాయికగా వస్తున్నారు.
''ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటనలను ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో రూపొందించిన చిత్రమిది'' అని 'గుర్తుందా శీతాకాలం' యూనిట్ పేర్కొంది.
ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు. లక్ష్మీ భూపాల్ మాటలు రాశారు. ఆల్రెడీ విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, సినిమాలో సాంగ్స్ హైలైట్ అవుతాయని, ఆ పాటల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బావుంటుందని నిర్మాతలు తెలిపారు.