BSP Chief RS Praveen Kumar:  కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్, సిర్పూర్ ప్రాంతాల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటిస్తున్నారు. సోమవారం సిర్పూర్ నియోజకవర్గంలోని అందవెళ్ళి వద్ద గల పెద్దవాగుపై నిర్మించిన అందెల్లి బ్రిడ్జి కూలిపోయి సంవత్సర కాలం గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోనప్ప మరమ్మతులు చేయించడం లేదని, కోట్ల రూపాయల బిల్లులు ఎత్తుకొని బ్రిడ్జి నిర్మించలేదని ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తాత్కాలిక రోడ్డు వేయించి, బిల్లులు తీసుకొని చేతులెత్తేశారని, కొంత కాలానికే ఆ రోడ్డు పాడైపోయిందన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా,అందవేల్లి బ్రిడ్జిని సందర్శించారు. 


కాగజ్ నగర్ నుంచి దహెగాం, పెంచికల్ పేట మండలాలకు చెందిన దాదాపు 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించిందన్నారు. అత్యవసర సమయంలో రవాణా సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలు అత్యంత ప్రమాదకరంగా వాగు దాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్, ఎమ్మెల్యే ఇంటికి 80 ఫీట్ల రోడ్డు వేయించుకునే పాలకులు పేదలకు మాత్రం రవాణా సౌకర్యాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. యాభై ఏళ్లుగా పాలకులు ఇలాగే పేదలకు చెందాల్సిన సొమ్మును అక్రమంగా దోపిడీ చేస్తున్నారని, కమీషన్ల కోసం నాసిరకం పనులు చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పజెప్పుతున్నారని విమర్శించారు. ఈ దోపిడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. కేవలం బహుజన రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు.


కాగజ్ నగర్ పట్టణంలోని బాలభారతి పాఠశాలను సందర్శించారు. గత 65 ఏళ్లుగా ఎంతో మంది ప్రయోజకులను, ఆఫీసర్లను అందించిన బాలభారతి పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మూసేయాలని చేస్తున్నారన్నారు. ఆ స్థలాన్ని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేకులని విమర్శించారు. ఎమ్మెల్యే అనుచరులు పేదల కోసం నడుస్తున్న పాఠశాలకు కరెంట్,నీళ్లు కట్ చేయడం, టీచర్లను వేధించడం దారుణమన్నారు. వేధింపులకు గురిచేస్తున్నవారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమన్నారు. పేద బిడ్డలకు చదువు అందాలన్నా,విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలన్నా బహుజన రాజ్యం రావాలన్నారు. బాలభారతి పాఠశాలను బహుజన రాజ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ గా అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు. 


పారిశుధ్య కార్మిక వ్యవస్థను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే కుట్ర
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉండరని.. రెగ్యులరైజ్ చేస్తామని హామి ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పారిశుధ్య కార్మికులను ఎందుకు పర్మినెంట్ చేయలేదని సీఎంను ప్రశ్నించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా కాగజ్ నగర్ పట్టణంలో మున్సిపాలిటీ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ముఖ్యమంత్రి పదవి ఉంటుందా? అలాగే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉండకూడదని చెప్పిన ముఖ్యమంత్రి 9 ఏళ్లు దాటినా పారిశుధ్య కార్మికులను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదన్నారు. 


కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి కష్టపడి ప్రజలను కాపడిన పారిశుధ్య కార్మికులపై కేసీఆర్ అంతటి వివక్ష చూపడం సరికాదన్నారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 25 వేల మంది పారిశుధ్య కార్మికులున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ పారిశుధ్య కార్మికులందరిని ఒక ప్రైవేట్ కంపెనీకి రాంకీ అనే కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. దమ్ముంటే ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకే డంపింగ్ యార్డు,చెత్త సేకరణ వంటి  కాంట్రాక్టులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యల గురించి బీజేపీ, కాంగ్రెస్,మరియు బిఆర్ఎస్ పార్టీలు ఏవి పట్టించుకోవడం లేదని, కేవలం బీఎస్పీ పార్టీతోనే కార్మికుల బతుకులు మారుతాయని తెలిపారు. అరకొర జీతాలిచ్చి, అనారోగ్య బారిన పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.అందుకే రాబోయే ఎన్నికల్లో కార్మిక వ్యతిరేక పార్టీలన్నింటినీ ఓడించి, ఏనుగు గుర్తుకు ఓటేసి బిఎస్పి ని గెలిపించాలని కోరారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial