తెలంగాణలో యూవర్శిటీలన్నీ బాసర త్రిపుల్ ఐటీని ప్రతిబింబిస్తున్నాయి. అన్ని విశ్వవిద్యాలయాలూ బాసర దుస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. వసతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితర సమస్యలు నిజామాబాద్ తెలంగాణ వర్శిటీలోనూ తిష్ఠ వేశాయి. వర్శిటీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు అధోగతే తప్ప.. పురోగతి లేకుండా పోయింది. వీసీలు, రిజిస్ట్రార్‌లు మారినా.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా వర్శిటీ రాత మాత్రం మారడం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో వర్శిటీ సమతమతవుతూనే ఉంది. బాసర విద్యార్థుల పోరాటం తెలంగాణ వర్శిటీ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపింది. సమస్యల పరిష్కారం కోస త్వరలోనే ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వర్శిటీ పాలకులు ముందే స్పందించకుంటే బాసరనే తలపించే అవకాశం ఉంది. 


తిష్ట వేసిన సమస్యలు


తెలంగాణ పేరుతో రాష్ట్రంలో ఉన్న ఏకైక వర్శిటీ నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయం. వర్శిటీ ఏర్పడి దశాబ్ధం గడిచిపోయినా ఇంకా సమస్యలతోనే సావాసం చేస్తోంది. ఈ వర్శిటీ పేరు చెబితే చాలు వివాదాలే గుర్తొస్తాయి. అంతలా ఏదో ఒక వివాదంతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది తెలంగాణ విశ్వవిద్యాలయం. పాలకులు మారినా వివాదాలు మాత్రం నిత్యకృత్యంగా మారిపోయాయి. దశాబ్ధ కాలం దాటినా ఇప్పటికీ వర్శిటీలో ఇంజినీరింగ్ కోర్సు లేదంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇక సౌకర్యాల మాట అక్కర్లేదు. విద్యార్థులకు సరిపడా వసతిగదులు లేక ఏళ్లుగా అవస్థలు పడుతున్నారు. వసతి గృహాల్లో సమస్యలైతే చెప్పనలవిగా మారిపోయాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు, నాణ్యమైన ఆహారం వంటి సమస్యలు నిత్యకృత్యంగా మారిపోయాయి. అధ్యాపకులు, సిబ్బంది కొరత వేధిస్తూనే ఉందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....


ఆర్టీసీ ఛైర్మన్‌ ప్రాంతంలోని వర్శిటీకి బస్సు సౌకర్యం లేదు


వర్శిటీ నిజామాబాద్ జిల్లా డిచిపల్లి సమీపంలో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డిచిపల్లి నుంచి ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. దీంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు రవాణా సౌకర్యం కోసం తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. వర్శిటీ ఉన్న నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ ఛైర్మన్ గా ఉన్నా.. బస్సు మాత్రం రావడం లేదంటే పరిస్థితి అర్థమవుతుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రం నుంచీ ఎలాంటి రవాణా సదుపాయం లేదు. బస్ షెల్టర్ నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాక ఇబ్బందులు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లాతోపాటు కామారెడ్డి, నిర్మల్ జిల్లాల నుంచీ విద్యార్థులు వర్శిటీకి వస్తారు. బస్సు లేక వీరంతా అవస్థలు పడుతున్నారు.


హెల్త్‌ సెంటర్‌లో వైద్యం కరవు


వర్శిటీ వసతి గృహంలో ఉండే విద్యార్థులకు అత్యవసరంగా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. 20 కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ జిల్లా కేంద్రమే దిక్కు. 2017లో హెల్త్ సెంటర్ నిర్మాణం చేపట్టి 2018లో పూర్తి చేశారు. ఇటీవల ప్రారంభించినా.. ఒప్పంద ప్రాతిపదికన ఒక్క డాక్టర్ మాత్రమే నియమించినా.. సాయంత్రం 5గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. మిగతా సమయాల్లో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. 2018లో క్యాంటీన్ నిర్మాణ పనులు మొదలు పెట్టి 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి చేశారు. ఏళ్లు గడుస్తున్నా ప్రారంభం కాలేదు. రోజువారీ అవసరాలకూ సైతం డిచిపల్లికి వెళ్లాల్సిన దుస్థితిలో విద్యార్థులు ఉన్నారు..


టీచింగ్ స్టాఫ్‌ లేరు చదువులు సాగవు


వర్సిటీ ఏర్పాటై పదిహేనేళ్లు దాటినా ఇప్పటికీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ స్థాయిలో అన్ని డిపార్టు మెంట్లలో భారీగా ఖాళీలు ఉన్నాయి. వీటిని రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయకపోవడం వల్ల అకాడమిక్‌ కన్సల్టెంట్లను తీసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. పూర్తిస్థాయి ప్రొఫెసర్లు లేకపోవడం వల్ల అకాడమిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయి. ఉన్న రెగ్యులర్‌ ప్రొఫెసర్లు సగం మంది స్థానికంగా ఉన్నా.. మిగతావారు హైదరాబాద్‌ నుంచి వచ్చిపోవడం వల్ల పాలన గాడి తప్పింది. నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేయలేదు. ఎక్కువ మంది ఔవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలోనే పనిచేస్తున్నారు.


స్పోర్ట్స్‌కు దూరం


యూనివర్సిటీలో విద్యార్థినిలకు ఒకే హాస్టల్ భవనం ఉంది. 500 మందికి 80గదులు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం 80 శాతం మంది విద్యార్థినిలు రానున్నారు. ఉన్న గదులు అస్సలు సరిపోని పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో లేడీస్ హాస్టల్ డిమాండ్ ఉన్నా వర్శిటీ అధికారులు పట్టించుకోవడం లేదు. విశ్వవిద్యాలయంలో క్రీడామైదానంలో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తుంది. విద్యార్థులు ప్రస్తుతం పోలీస్ ఉద్యోగాలకు కోసం సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో కనీసం గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్ లేదు. స్పోర్ట్స్ బోర్డు లేకపోవడంతో విద్యార్థులకు శిక్షకులు లేకపోవడం సమస్యగా మారింది. ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ సైతం ఉంది.


బాసర విద్యార్థుల స్ఫూర్తితో పోరాటం


ఈ సమస్యల పరిష్కరం కోసం విద్యార్థులు బాసర స్ఫూర్తితో ఈనెల 20న వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. వెంటనే సమస్యలు పరిష్కరంచాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్లుగా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ వర్శిటీ విద్యార్థులు పలు రకాలుగా ఆందోళనలు చేసినా బాసర విద్యార్థుల పోరాటం కొత్త మార్గం చూపింది. దీంతో తెలంగాణ విశ్వవిద్యాలయంలో సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా వర్శిటీల్లో ఆందోళనలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఆ ప్రమాదం రాకముందే వర్శిటీల పాలకులు స్పందించాల్సిన అవసరం ఉంది. వసతులు, సౌకర్యాలు వంటివి తీర్చడంతోపాటు శాశ్వత సమస్యల పరిష్కారానికీ ముందుకొస్తేనే ఇబ్బంది తప్పుతుంది..