నిజామాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇందూరు కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు పార్టీ నేతలకు తలనొప్పి వ్యవహారంగా మారాయి. డి. శ్రీనివాస్‌ ఆయన కుమారుడు సంజయ్‌ ఆదివారం గాంధీ భవన్‌లో పీసీసీ ఛీఫ్‌ రేంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ తెలంగాణ, సీనియర్లు వి. హన్మంతరావు, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. అయితే తండ్రీకొడుకులిద్దరూ తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరడంపై అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్యే టికెట్‌ ఆశించే ఇలా పార్టీ మారారని అంటున్నారు. మరోవైపు డీ శ్రీనివాస్‌ మరో తనయుడు ధర్మపురి అరవింద్‌ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఈ క్రమంలో తండ్రీకొడుకులిద్దరూ ఇలా కాంగ్రెస్‌లో చేరడంపై పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం  చేస్తున్నారు. 


ఆ పార్టీ నిజామాబాద్‌ జిల్లా ఇన్‌ చార్జి మహేష్‌ గౌడ్‌ వీరిద్దరూ పార్టీలో చేరడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదంటున్నారు. అసలు ఎవరిని అడిగి పార్టీలో చేర్చుకున్నారని ఆయన పార్టీ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. పీసీసీ జిల్లా అధ్యక్షుడినైన తనకే సమాచారం ఇవ్వకుండా ఇలా చేయడమేంటని? ఆయన అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉంటూ.. పార్టీ కష్టకాలంలో పనిచేసిన తమను పక్కన పెట్టి హైకమాండ్‌ ఈ నిర్ణయం తీసుకోవడమేంటని ఆయన మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఆశిస్తూ డీ శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్‌లు కాంగ్రెస్‌లో చేరారనే ప్రచారం సాగుతోంది. అయితే తాను కాంగ్రెస్ లో చేరలేదని చెబుతూనే, చేరారని భావిస్తే ఇదే తన రాజీనామా అంటూ డీఎస్ రాజీనామా లేఖను విడుదల చేశారు. 


మరోవైపు నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ ఇస్తామని తనకు పార్టీ హామీ ఇచ్చిందని పార్టీ ఇన్‌చార్జ్‌ మహేష్‌ చెబుతున్నారు. మొత్తానికి ఈ టికెట్‌ లొల్లి కాంగ్రెస్‌ హైకమాండ్‌కు పెద్ద తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. అయితే డీఎస్‌ ఫ్యామిలీ కాదు.. గతంలో కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారందరూ కూడా చాలా మంది తిరిగి ఆ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే వీరందరూ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఆశించే ముందుగా పార్టీలోకి చేరుతున్నారంటున్నారు.  అయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇలాంటి లుకలుకలను ఎలా పరిష్కరిస్తారో..! ఈ టికెట్ల లొల్లిని ఎలా కంట్రోల్‌ చేస్తారో తేలాలంటే కొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 


డీఎస్‌ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే మంత్రిగానూ సేవలు అందించారు. వయసురీత్యా అనారోగ్య సమస్యల కారణంగా పొలిటికల్ గా అంతగా యాక్టివ్ గా లేరు డీఎస్. ఆయన తనయుడు సంజయ్‌ కూడా పలు పదవులు చేపట్టారు. నిజామాబాద్‌ మేయర్‌గానూ పనిచేశారు. అయితే సీనియర్‌ అయిన డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరితే ఎంతో కొంత ప్లస్‌ అవుతుందనే ఉద్దేశంతోనే వారిని పార్టీలో చేర్చుకున్నారంటున్నారు. 


కాంగ్రెస్ పార్టీకి మరోసారి డీఎస్ రాజీనామా
కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ అన్నారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వెళ్లాలన్నారు. ఆ సందర్భంలో తనకు కాంగ్రెస్ కండువాలు కప్పారన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్... తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు డీఎస్.