D Srinivas Resign : కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ అన్నారు. తన కుమారుడు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వెళ్లాలన్నారు. ఆ సందర్భంలో తనకు కాంగ్రెస్ కండువాలు కప్పారన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్... తాను కాంగ్రెస్ లో చేరినట్లు భావిస్తే ఇదిగో నా రాజీనామా అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు డీఎస్.  


క్రియాశీల రాజకీయాలకు దూరం 


తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలపై సీనియర్‌ నేత , మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ స్పందించారు. తనను వివాదాల్లోకి లాగొద్దంటూ లేఖ రాశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు డీఎస్. నిన్న తన కుమారుడు సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరారని, సంజయ్‌తోపాటు తాను కూడా గాంధీ భవన్‌కు వెళ్లానన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు భావిస్తే రాజీనామా చేస్తున్నానని డీఎస్‌ వెల్లడించారు. వయసు రీత్యా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టంచేశారు.  తన లేఖలో భార్య విజయలక్ష్మిని సాక్షిగా డీఎస్ పేర్కొన్నారు. డీఎస్‌ ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని ఆయన భార్య విజయలక్ష్మి తెలిపారు. రాజకీయాల కోసం డీఎస్‌ను వాడుకోవద్దని ఆయన భార్య విజయలక్ష్మి అన్నారు. డీఎస్‌కు ఇప్పటికే ఒకసారి బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ వారికి చేతలు జోడించి దండం పెడుతున్నా,  డీఎస్‌ను కొంచెం ప్రశాంతంగా బతకనివ్వండన్నారు.  


డీఎస్ కు ప్రాణ హాని ఉంది- సంజయ్ 


డీస్ రాజీనామా వ్యవహారంపై ఆయన కుమారుడు సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్ పై కుట్ర జరుగుతోందని, ఆయకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. డీఎస్ చుట్టూ ఉన్నవాళ్లపై అనుమానం ఉందన్నారు. డీఎస్ ను గదిలో బంధించి బలవంతంగా సంతకం చేయించారన్నారు. ఆస్తులు కూడా అలాగే రాయించుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఎంపీ అర్వింద్ హస్తం ఉందన్నారు. అర్వింద్ అంతు చూస్తానని హెచ్చరించారు. ఎంపీ అర్వింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేసి లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారన్నారు. డీఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్ అన్నారు. డీఎస్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయించడంలేదన్నారు. 


"మొన్నటి వరకూ నేను గొప్పొడిన అని చెప్పిన నువ్వు ఎందుకు భయపడుతున్నాను. నన్ను చూసి ఓట్లు వేశారని చెప్పుకున్నావ్ కదా. కన్న తండ్రితో ఇలాంటి ఆటలు ఆడుతున్నాడు. నిజామాబాద్ ప్రజలు అతడ్ని ఇంకెప్పుడూ నమ్మరు. మా అమ్మ అర్వింద్ ఎట్లా చెబితా అలా చేస్తుంది. ఆమెకు పాలిటిక్స్ తెలియదు. బీజేపీ ఎంపీ ఏ లెవల్ కు దిగజారి, ఎలా చేయిస్తున్నారనేది అందరికీ తెలిసింది. డీఎస్ కు ప్రాణహాని ఉందని నాకు డౌట్. ఆయన వందల మందికి చెప్పారు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు. కానీ ఇంతలో ఆయనను బెదిరించి రాజీనామా చేయించారు. ఇలాంటి కార్యక్రమాలు మంచిది కాదు" - సంజయ్, డీఎస్ కుమారుడు