Betting Apps: యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్,గేమ్ యాప్‌లకి అలవాటు పడి అప్పులపాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అక్రమ బెట్టింగ్ యాప్స్‌లలో బెట్టింగ్‌కి పాల్పడిన, ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావ్ హెచ్చరించారు.


నేటి సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం, సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగిందని తెలిపారు. ప్రతిఒక్కరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, కొన్ని సందర్భాల్లో అవగాహన లోపం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. మోసపూరిత ప్రకటనలు, సందేశాలు చూసి మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ బెట్టింగులు పెట్టడం, ఆన్లైన్‌లో గేమ్స్ ఆడటం, గుర్తింపు లేని సంస్థల్లో డబ్బు పెట్టుబడి పెట్టి ఆర్థిక నష్టాల బారిన పడుతున్నారని హెచ్చరించారు. తద్వారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. అవగాహన లేక అత్యాశకు పోయి ఆన్లైన్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల మోసాలబారిన పడుతున్నారన్నారు. బెట్టింగ్ యాప్‌లు చాలా ప్రమాదకరమైనవి, వీటిల్లో ఒక్కసారి చిక్కుకుంటే బయటకు రావడం ఇబ్బంది అవుతుందని హెచ్చరించారు. యాప్ నిర్వాహకుల నుంచి బెదిరింపులు వస్తాయి అన్నారు. 


తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి బానిసలుగా మారుతున్నారు. అప్పులపాలపై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారు. విలువైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్లు సోషల్ మీడియాలో వీటిని ప్రోత్సహించడం వల్ల యువతలో ఈ వ్యసనం పెరుగుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. వీటి కట్టడికి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా  ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.


అక్రమ బెట్టింగ్ యాప్స్ లలో బెట్టింగ్ కి పాల్పడిన,ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లలో గేమ్స్ ఆడిన, ప్రోత్సాహించిన కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌లు ఆయా యాప్ నిర్వాహకుల సూచనల మేరకే ఆపరేట్ చేస్తారని, ఆన్లైన్ గేమింగ్ మాటున ప్రమాదకర మాల్ ప్రాక్టీస్ ఉంటుంది వ్యక్తి గత సమాచారం, అకౌంట్ వివరాలు తెలుసుకొనే అవకాశం ఉన్నందున గేమింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.


ఈ అక్రమ బెట్టింగ్ యాప్‌లను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసే ఎవరిపైనా ఉపేక్షించేది లేదని ప్రజలు, యువత అప్రమత్తంగా ఉండి, ఇటువంటి కార్యకలాపాలపై వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నార.ు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయిన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి ప్రచారాన్ని చేయవద్దన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు ఎస్పీ డివి శ్రీనివాస్ రావ్ తెలిపారు.