Police Denies Permission to Bandi Sanjay Praja Sangrama Yatra: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌కు పోలీసులు షాకిచ్చారు. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఇదివరకే నాలుగు విడతల పాదయాత్ర ముగియగా, ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర నవంబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు బండి సంజయ్ పాదయాత్రకు ఇటీవల పోలీసుల అనుమతి కోరారు. కానీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతిభద్రతల కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించినట్లు ఈ మేరకు నిర్మల్‌ జిల్లా ఎస్పీ సురేశ్‌ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఐదో విడత పాదయాత్రను బండి సంజయ్ బైంసా నుంచి పాదయాత్ర ప్రారంభించి, కరీంనగర్‌లో భారీ సభతో ముగించాలని తొలుత భావించారు. కానీ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి. 


బండి సంజయ్ అరెస్టుకు పోలీసుల యత్నం..
ఐదో విడత పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించినా బండి సంజయ్ నిర్మల్ వెళ్తున్నారనే సమాచారంతో జగిత్యాల దాటాక ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. బండి సంజయ్ వెనక్కి తిరిగి వెళ్లకపోవడంతో జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు బండి సంజయ్ ను అడ్డుకుని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. అయితే కార్యకర్తలు, బీజేపీ శ్రేణుల సహాయంతో బండి సంజయ్ పోలీసుల నుంచి తప్పించుకుని కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లినట్లు సమాచారం. పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించడంతో పాటు బండి సంజయ్ ను అరెస్ట్ చేసే యత్నం చేయడంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది.


బండి సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు కానీ ! 
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల పాదయాత్ర పూర్తి  చేశారు.  ఈనెల 28 నుండి బండి సంజయ్  5వ విడత పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.  నిర్మల్ నియోజకవర్గంలోని  అడెల్లి పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 5వ విడత పాదయాత్ర ప్రారంభిస్తారు. కరీంనగర్ లో ముగింపు సభ నిర్వహిస్తారు.  డిసెంబర్ 15 లేదా 16 వరకు పాదయాత్ర సాగుతుంది. సీఎం కేసీఆర్ కుటుంబ- అవినీతి -నియంత పాలనకు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పటి వరకు 4 విడతలు పాదయాత్ర చేసి 13 ఎంపీ, 48 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు మొత్తం 21 జిల్లాల్లో 1178 కి.మీల మేర నడిచినట్లు బీజేపీ ప్రకటించింది. ఐదో విడత పాదయాత్రను అక్టోబర్‌లోనే చేయాలనుకున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నికల కారణంగా వాయిదా వేసుకున్నారు. 


మునుగోడు ఉపఎన్నిక కారణంగా గతంలో వాయిదా


పాదయాత్రతో అనేక మార్పులు సంభవించాయని, తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేననే సంకేతాలు వెలువడ్డాయని పాదయాత్ర సహ ప్రముఖ్ వీరేందర్ గౌడ్ తెలిపారు.   బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్రను కొనసాగించి 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. మొత్తం బండి సంజయ్ పన్నెండు వందల అరవై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. గత ఏడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుండి ప్రారంభించిన ప్రజా సంగ్రామ యాత్ర ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు కొనసాగుతూనే ఉంది. గ్రేటర్ పరిధిలోనూ బండి సంజయ్ పాదయాత్ర పూర్తి చేశారు.