నిజామాబాద్ జిల్లా మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు ముంపు గ్రామాల రైతులు ఒప్పుకోకపోయినా.. ప్రస్తుతం ఉన్న చెరువు ద్వారానే సాగుకు నీటిని అందించేందుకు నిర్మాణాలను పూర్తిచేస్తున్నారు. కాళేశ్వరం 20, 21వ ప్యాకేజీల ద్వారా 2 లక్షల ఎకరాలకు నీటిని అందించేందుకు పైప్‌లైన్‌ల నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. సారంగపూర్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్‌లు ఈ వారంలోనే ట్రయల్‌రన్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. వచ్చే వానాకాలం సీజన్‌లో ఈ రెండు ప్యాకేజీల ద్వారా జిల్లాలోని నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు పనులను పూర్తి చేస్తున్నారు.
కాల్వలకు బదులు పైప్‌లైన్‌ల ద్వారా నీటిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముంపు గ్రామాల ప్రజలు మాత్రం పాత డిజైన్ ప్రకారమే నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. అధికారులతో జరిగిన సమావేశంలో తమ విజ్ఞప్తులను ఇస్తూనే.. మంచిప్ప వద్ద పనులను అడ్డుకుంటున్నారు. రిజర్వాయర్ ఎత్తు పెంచకుండా.. మొదట నిర్ణయించిన విధంగానే నిర్మాణం చేయాలని కోరుతున్నారు. ప్రాణహిత చేవెళ్ల పథకం కింద 20, 21, 22వ ప్యాకేజీ పనులను చేపట్టారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నుంచి ఉమ్మడి జిల్లాకు సాగునీరు అందించేందుకు మూడు ప్యాకేజీల ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు డిజైన్ చేశారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్యాకేజీలను కాళేశ్వరం పథకంలో కలిపారు. ఈ ప్యాకేజీల కింద కాల్వలకు బదులు పైప్‌లైన్‌ల ద్వారా సాగునీటిని అందించేందుకు రీడిజైన్ చేశారు. దీనిలో భాగంగా మంచిప్ప రిజర్వాయర్ ఎత్తు పెంచేందుకు నిర్ణయించారు. గతంలో ఇచ్చిన 1.5 టీఎంసీలకు బదులు 3.5 టీఎంసీల నీళ్లను నిల్వ చేసేందుకు రీడిజైన్ చేశారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖల అనుమతులు తీసుకున్నారు. మంచిప్ప ఎత్తు పెంచితే 2,400 ఎకరాల వరకు భూములు మునిగిపోతున్నాయి. మంచిప్ప గ్రామంతోపాటు తొమ్మిది తండాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని భూములు ముంపునకు గురవుతున్నాయి. అంతేకాకుండా.. అటవీ భూమి వెయ్యి ఎకరాలకుపైగా పోతుండగా, రైతుల భూమి 1400 ఎకరాల వరకు ముంపునకు గురవుతోంది. వీటితో పాటు తండాలు నీట మునగనున్నాయి. ఏళ్ల తరబడి వ్యవసాయం చేస్తున్న రైతులు పాత డిజైన్ ప్రకారమే నిర్మా ణం చేయాలని కొత్త డిజైన్‌ను ఆమోదించవద్దని కోరుతున్నారు.
ఇప్పటికే చాలా సార్లు ధర్నాలు నిర్వహించడంతోపాటు అధికారులకు విజ్ఞప్తులను చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిజర్వాయర్ ఎత్తు పెంచి నిర్మాణం చేసేందుకు భూసేకరణ కోసం ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ప్రస్తుతం ఉన్న కొండెం చెరువు ద్వారానే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 20, 21వ ప్యాకేజీల ద్వారా సాగునీరు అందించేందుకు నిర్మాణ పనులు వేగంగా చేస్తున్నారు. వానాకాలంలో కనీసం 50 వేల ఎక రాలకు సాగునీరు అందించేందుకు సిద్ధమవుతున్నారు.
సారంగపూర్, మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సారంగపూర్ పంప్‌హౌజ్ నిర్మాణ పనులు పూర్తికాగా, ఈ వారం చివరిలోపే ట్రయల్‌రన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ట్రయల్‌రన్ కోసం అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారి, జిల్లా ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రయల్‌రన్ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్‌ను నవీపేట మండలం బినోల నుంచి సారంగపూర్ వరకు టన్నెల్ ద్వారా మళ్లిస్తారు. సారంగపూర్ సర్జ్‌పూల్‌లో ఏర్పాటు చేసిన పంప్‌ల ద్వారా నిజాంసాగర్ కాల్వల్లో నీటిని ఎత్తిపోస్తారు.
ఈ నీటిని డిచ్‌పల్లి మీదుగా మెంట్రాజ్‌పల్లి వరకు నిజాంకాల్వల ద్వారా తరలిస్తారు. మెంట్రాజ్‌పల్లిలో ఏర్పాటు చేసిన పంప్‌ల ద్వారా నీటిని పైప్‌లైన్‌లకు మళ్లిస్తారు. ఈ రెండు పంప్‌హౌజ్‌లలో ట్రయల్‌రన్ డ్రై, వెట్ నిర్వహించేందుకు సారంగపూర్ వద్ద మూడు పంప్‌హౌజ్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2,100 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ కాల్వలో ఎత్తిపోయనున్నారు. మెంట్రాజ్‌పల్లి వద్ద 10 పంపులను ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా నీటిని పైప్‌లైన్‌లకు మళ్లించి ఆయకట్టుకు అందిస్తారు.
సారంగపూర్ పంప్‌హౌజ్ నుంచి నిజాంసాగర్ కాల్వ ద్వారా మాసాని చెరువుకు కొంతనీరును తరలిస్తారు. మాసాని చెరువు నుంచి మంచిప్ప వద్ద ఉన్న కొండెం చెరువుకు నీటిని మళ్లిస్తారు. అక్కడ నిర్మాణం అవుతున్న గడ్కోల్ పంపు ద్వారా సిరికొండ మండల వరకు నీటిని తరలిస్తారు. మంచిప్ప వద్ద నిర్మాణం చేస్తున్న గడ్కోల్ పంప్‌హౌజ్ పనులు మరో ఆరు నెలల తర్వాత పూర్తికానున్నాయి. ఈ పంప్‌హౌజ్ ద్వారా మోపాల్ నుంచి సిరికొండ మండలం గడ్కోల్ వరకు 85వేల ఎకరాల వరకు సాగునీటిని అందించనున్నారు. మొదట నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల పరిధిలో మెంట్రాజ్‌పల్లి పంప్‌హౌజ్‌ల ద్వారా ఈ వానాకాలంలో ఆయకట్టుకు నీటిని అందించే విధంగా ప్రణాళిక సిద్దం చేశారు. కొండెం చెరువు నుంచి నీటి తరలింపు మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం పూర్తికాకున్నా.. ప్రస్తుతం ఉన్న కొండెం చెరువులో నుంచి నీటిని తరలిస్తూ.. జిల్లాలోని సారంగపూర్, మెంట్రాజ్‌పల్లి, గడ్కోల్ పంప్‌హౌజ్‌ల ద్వారా సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. మరోవైపు ముంపు గ్రామాల ప్రజలు మాత్రం రీ డిజైన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.