Tiger Zone In Asifabad | ఆసిఫాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదు, ప్రజలను పీడించే రాక్షస పాలన అని.. తెలంగాణ ప్రభుత్వం జీవో 49 రద్దు చేసిందంటూ కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తున్నారని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. నిజానికి అది కేవలం తాత్కాలిక నిలుపుదల మాత్రమే అని, స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు ఆడుతున్న నాటకమని విమర్శించారు. 


దమ్ముంటే జీవో 49 పూర్తిగా రద్దు చేయండి


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్నది ప్రజా పాలన కాదని.. ప్రజలను పీడించే రాక్షస పాలన అని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జీవో 49 రద్దు చేశామంటూ మంత్రులు, కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రకటనలు చేయడం సరికాదని హితవు పలికారు. దమ్ముంటే పూర్తిస్థాయిలో జీవో 49ను రద్దు చేసి టైగర్ రిజర్వ్ ఆంక్షలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులను ఊళ్ళో తిరగనివ్వకుండా చేస్తారని భయంతో జీవో 49 నిలిపివేశామని డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. 




ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు కొత్త డ్రామాలు


‘జీవో49 మీ ప్రభుత్వమే తీసుకొచ్చింది, మళ్ళీ మీరే రద్దు అంటూ ప్రకటించుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెర్రి అనాలా.. లేక పైశాచిక ఆనందం అనాలా అర్థం కావడం లేదు. ఈ కాంగ్రెస్ నాయకులు ఒంటెద్దు పోకడలు చూస్తున్న ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమైంది. ఈ కాంగ్రెస్ రాక్షస పాలనలో ప్రజలు మోసపోతున్నారు. ఆదివాసుల మనోభావాలను దెబ్బతిస్తూ, ఓట్ల కోసం కొత్త డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముం, దైర్యం, సిగ్గు ఉంటే 49జీవో ని పూర్తిగా రద్దు చెయ్యాలి. ఈ నాటకాలు అపి ఆసిఫాబాద్ ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించండి. ఆదివాసులను అభివృద్ధి బాటలో వెళ్లేందుకు ప్రోత్సహించండి. 


ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 49 జీవో ను పూర్తిగా రద్దు చెయ్యకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తాం. పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేసి తెలంగాణ ప్రభుత్వానికి నిద్ర పట్టకుండా చేస్తాం. ముందు ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చండి.. కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జీవో 49 పూర్తిగా రద్దు చెయ్యాలి. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు కొనసాగిస్తాం’ అని కోవలక్ష్మి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.