నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ది కమిటీల ఆగడాలు రోజు రోజుకీ మితి మీరిపోతున్నాయి. ఇంతటి సాంకేతిక యుగంలోనూ... గ్రామాల్లో విలేజ్ డెవెలప్మెంట్ కమిటీల పేరుతో రాచరిక పాలన కొనసాగిస్తున్నారు. పెదరాయుళ్ల తీర్పులు ఇస్తున్నారు. న్యాయాలు, చట్టాలు వీరికి కనిపించవు. వీరిచ్చిన తీర్పే వేధం అక్కడ. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు అంతా ఇంతా కాదు. నందిపేట మండలం శాపూర్ గ్రామంలో ఓ కరెంట్ మీటర్ ఇష్యూ... 80 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసే దాకా వచ్చింది. శాపూర్ గ్రామానికి చెందిన ముప్పేట గంగాధర్ అనే వ్యక్తికి చెందిన  కరెంట్ మీటర్ రెండేళ్ల క్రితం ఓ మహిళ అవసరం రిత్యా వాడుకున్నారు. గంగాధర్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి మీటర్ అడిగితే గ్రామాభివృద్ధి చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. న్యాయమైన డిమాండ్ కోసం గంగాధర్ గ్రామాభివృద్ధి కమిటీని నిలదీస్తే అతని కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. గంగాధర్ కులస్తులు అతనికి సపోర్ట్ గా నిలిచారని వారి సామాజికవర్గానికి చెందిన 80 కుటుంబాలను గ్రామంలో సామాజిక బహిష్కరణ చేశారు. వారికి గ్రామంలో ఎవరూ సహకరించవద్దు. కిరాణ కొట్టులో సరుకు ఇవ్వొద్దు. పాలు పోయవద్దు. ఆటోలో ఎక్కించవద్దు. కనీసం మంచి నీరు కూడా వారికి ఇవ్వకుండా గ్రామంలో డప్పు చాటింపు చేశారు. ఇలా దుర్మార్గమైన రీతిలో వ్యవహరిస్తున్నాయ్ గ్రామాభివృద్ధి కమిటీలు. ఒక్కశాపూర్ లోనే కాదు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో వీడీసీల అగడాలు అంతా ఇంతా కాదు. వీరిని ఎవరు ఎదిరించినా ఇదే గతి పడుతుంది. చిన్న తప్పు జరిగినా లక్షల్లో జరిమానాలు విధిస్తారు. గ్రామంలో సర్పంచ్ ఉన్నా అజమాయిషీ మొత్తం వీడీసీలదే.... పెదరాయుళ్ల తీర్పులతో వారు చెప్పిందే వేధం అన్నట్లు వ్యవహరిస్తారు. వీడీసీల తీరుతో గ్రామాల్లో చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసు స్టేషన్ కు వెళ్లినా, కోర్టు మెట్లెక్కినా... లాభం లేకుండా పోతోంది. అలా వెళ్లినా కూడా మళ్లీ వారికి గ్రామ బహిష్కరణ తప్పదు. 

 

జక్రాన్ పల్లిలో గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ  

 

గీత కార్మికులు ప్రతి ఏడాది వీడీసీకి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసింది. కుదరదు అన్నదానికే 80 మంది గీత కార్మికులను జక్రాన్ పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సాంఘిక బహిష్కరణ చేసింది. వారంతా న్యాయపోరాటానికి దిగారు. ఏ కులస్తులకు లేనివిధంగా ప్రతి ఏడాది వీడిసికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వాపోతున్నారు గీత కార్మికులు. ఏ కులంకు చెందిన వారు వారి వృత్తులను సాఫీగా కొనసాగిస్తుంటే, కేవలం గీతా కార్మికులు మాత్రమే ప్రతి ఏడాది లక్షల్లో డబ్బులు గ్రామ కమిటీలకు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం మద్యం, ఇతర మత్తు పదార్థాలు మార్కెట్లో విచ్చలవిడిగా దొరకడంతో కల్లు తాగడం తగ్గిపోయింది. దీంతో ఆర్థికంగా గీత కార్మికులు కష్టాల పాలు అవుతున్నారు. కుటుంబాల పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో గ్రామ కమిటీలకు భారీగా మామూల్లను ఇవ్వలేని పరిస్థితి. నెలకొందని వాపోతున్నారు. ఇలా జక్రాన్పల్లి గ్రామంలో కొనసాగుతున్న అరాచకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. 

 

అసలు వీడీసీలు ఎలా ఆవిర్భవించాయ్ 

 

1970లో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి. వీటి ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో మౌలిక సదుపాయలు కల్పించుకోవటం... నాలాలు కట్టించటం, రోడ్డు వేయించుకోవటం.. వీధి దిపాలు పెట్టించటం ఇలా గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంచి లక్ష్యంతో ఏర్పడ్డాయి వీడీసీలు. గ్రామంలో ప్రతి ఇంటికి కొంత డబ్బులు కలెక్ట్ చేసి వాటితో గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించేవారు. ఇది రాను రాను వీడీసీలు అంటే గ్రామాల్లో ఒక ప్రత్యేక పాలనగా మారిపోయింది. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లొద్దు. న్యాయస్థానాలు ఆశ్రయించొద్దు. ఇలా అనేక ఆంక్షలు పెట్టి వారిదే పెత్తనంగా మారిపోయింది. వీరు తీర్పు ఇస్తే అదే వేదం అన్నట్లు తయారైంది. సర్పంచ్ ఉన్నా... గ్రామాభివృద్ధి కమిటీల వద్దే పంచాయితీ నడవాలి. ఏ చిన్న తప్పు చేసినా జరిమానాలు. జరిమానాలు కట్టకుంటే సాంఘీక బహిష్కరణలు ఇలా గ్రామాల్లో ప్రజలకు వీడీసు ఓ ఆరాచక అధికార కేంద్రాలుగా మారిపోయాయ్. ఈ వీడీసీలను తొలగించాలని ఎన్ని సార్లు ఫిర్యాదులు చేసినా రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గాల్సిన పరిస్థితులున్నాయంటున్నారు గ్రామాల ప్రజలు.