Nizamabad Double Bedroom Houses: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చేపడుతున్న పనులు నిలిచిపోయాయి. పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌ రూమ్‌  ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సొంత స్థలం ఉన్న వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు నిర్మించుకునేందుకు రూ. 5 లక్షలు కేటాయించింది. ఐదు విడతల్లో బిల్లులు మంజూరు చేస్తోంది. అయితే బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. ఉన్న ఇంటిని కూల్చి గుడిసెలో ఉంటున్నామని లబ్ధిదారులు వాపోతున్నారు.

 

నిలిచిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు.. 

రుద్రూరు మండలంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఏడాదిగా బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఉన్న ఇళ్లను కూల్చివేసి మరీ సొంత గూడు నిర్మాణానికి పూనుకున్న ప్రజల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. మండలంలోని లబ్ధిదారులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ బిల్లుల కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సకాలంలో బిల్లులు మంజూరు చేసే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటామని లబ్ధిదారులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

 

రుద్రూరు మండలంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులు ఏడాది కాలంగా బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. రుద్రూరు గ్రామానికి 156, బొప్పాపూర్‌కు 30, రాయకూర్‌కు 30, అంబం కు 30, చిక్కడ్‌పల్లికి 25, అక్బర్‌నగర్‌కు 44, రాణంపల్లికి 40, సిద్దాపూర్‌కు 20 చొప్పున ఇళ్లు మంజూరు కాగా ఇందులో బొప్పాపూర్‌, రాణంపల్లి గ్రామాల్లో మొదటి విడతలో కొన్ని డబుల్‌ బెడ్‌ రూమ్‌లకు బిల్లులు వచ్చాయి. కానీ రెండో విడతలో మిగతా గ్రామాల్లో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌లకు ఇప్పటి వరకు బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఇళ్లను కూల్చివేసి కొత్తగా డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణాలు ప్రారంభించగా మధ్యలోనే  నిర్మాణాలు ఆపేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారులకు ప్రస్తుతం ఉండటానికి ఇల్లు లేక అవస్థలు పడుతున్నారు. 

 

ప్రభుత్వం సకాలంలో బిల్లులు మంజూరు చేస్తుందన్న నమ్మకంతో కొందరు వడ్డీలకు డబ్బులు తీసుకువచ్చి మరీ నిర్మాణాలు చేపట్టారు. మరికొందరైతే నగలను విక్రయించి పనులను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బిల్లులు రాకపోవడంతో వడ్డీ భారం లబ్ధిదారులపై పడుతోంది. ఇంటి నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవడంతో పాటు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సకాలంలో బిల్లులు మంజూరు చేయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. మరోవైపు పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయినా చాలా చోట్ల ఇంకా లబ్ధిదారులకు ఇవ్వలేదు. దీంతో నిర్మించిన ఇళ్లు దెబ్బతింటున్నాయ్. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని పేద ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.