Nizamabad junction is crucial in South Central Railway: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రతిసారి నిజామాబాద్ జిల్లా రైల్వే కు కేంద్రం నుంచి మొండి చేయి ఎదురవుతూనే ఉంది. ఈ సారైనా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు న్యాయం జరుగుతుందా అని జిల్లా వాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో నిజామాబాద్ జంక్షన్ పరిధిలో పెద్దగా రైల్వే పనులకు నిధులు కేటాయించలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా కొత్త పనులకు ఆమోదం తెలపాలని, పాతవి పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని ఉభయ జిల్లాల ప్రజలు కోరుతున్నారు.
దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం
తెలంగాణ - మహారాష్ట్రను కలిపే నిజామాబాద్ జంక్షన్ దక్షిణ మధ్య రైల్వే ( South Central Railway ) పరిధిలో కీలకమైంది. కానీ దూర ప్రాంతాలకు పెద్దగా రైళ్లు నడవట్లేదు. కేవలం మహారాష్ట్ర మార్గంలో రోజుకు నాలుగు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో రెండు ప్యాసింజర్ కాగా మరో రెండు ఎక్స్ ప్రెస్ రాజస్థాన్, ఏపీలకు మరో నాలుగు రైళ్లు నడుస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీతో సహా వివిధ ప్రాంతాలకు అదనపు రైళ్లు కేటాయించాలని ఏళ్లుగా డిమాండు ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వేలాది మంది ముంబయిలో ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపవస్తున్నవారు చాలా మంది ఉన్నారు.
ముంబయి - కరీంనగర్- (Mumbai - Karimnagar Weekly Express) వరకు కేవలం వీక్లీ ఎక్స్ ప్రెస్ మాత్రమే నడుస్తోంది. దీన్ని రోజువారీగా మార్చటంతో పాటు అదనంగా రైళ్లను కేటాయించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇటు ఢిల్లీ అటు ముంబయ్ కి నేరుగా రైళ్లను పెంచితే ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుంది. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు నిత్యం ప్రైవేట్ బస్సుల్లో వెళ్తున్నారు. వారికి ప్రయాణ ఖర్చులు ఎక్కువవుతున్నాయ్. అదే రైళ్ల సంఖ్య పెంచితే గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ప్రకటన
కొత్తగా ఆర్మూర్-ఆదిలాబాద్ మార్గం విషయంలోనూ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ బడ్జెట్లోనే కేంద్రం 100 శాతం నిధులు విడుదల చేస్తుందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఇది పూర్తయితే ఆదిలాబాద్, నాగ్ పూర్ ప్రయాణం మరింత సులభం కానుంది.
బోధన్ - బీదర్ రైల్వే మార్గానికి సైతం త్వరలో ఆమోదం రానుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ తెలిపారు. గతం లోనే దీని సర్వే పూర్తయింది. 134 కి.మీ. మార్గానికి దాదాపు రూ.2,200 కోట్లు ఖర్చు కానుందని అంచనా వేశారు. తెలంగాణలో కేవలం 15 కి.మీ. మాత్రమే మార్గం ఉండగా, ఆ ఫైల్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
మేడ్చల్ - ముడే ఖేడ్ వయా నిజామా బాద్ డబ్లింగ్ పనులకు ఇటీవల రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. 428 కి.మీ. పనులకు సంబంధించి రూ.4,686 కోట్లు, అవసరం. ఈ బడ్జెట్లో నైనా నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా వాసులు కోరుతున్నారు.