Fake Railway Jobs In Nizamabad District: నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అమాయకులను ఓ యువకుడు బురిడీ కొట్టించిన వైనం వెలుగు చూసింది. అసలే రైల్వేలో ఉద్యోగాలంటే అభ్యర్థులు ఎంతో ఆసక్తి చూపుతారు. రైల్వేలో జాబ్ వస్తే లైఫ్ బిందాస్ అని భావించే ఉద్యోగార్థుల నుంచి ఒక్కోక్కరి నుంచి రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు.
అసలేం జరిగిందంటే..
నవీపేట మండలం ఫకీరాబాద్ కు చెందిన నరేష్ అనే యువకుడు నగరంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక యువకులను, నిరుద్యోగులకు మోసం చేశాడు. రైల్వేలో ఉద్యోగాలు అంటూ ఒక్కొక్కరి నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితుడు.. సౌత్ సెంట్రల్ రైల్వే పేరిట డూప్లికేట్ ఐడి కార్డులు ఇస్తున్నాడు. డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు నరేష్ ను నిలదీయడంతో పరారయ్యాడు. అయితే శుక్రవారం రైల్వే స్టేషన్ ప్రాంతంలో బాధితులు, నరేష్ ను గుర్తించి పట్టుకొని, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు.
ఇప్పటివరకు జిల్లాలో చాలా మంది అమాయక ప్రజలకు ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు బాధితులు వాపోయారు. రూ. 50 వేల నుంచి లక్ష వరకు తాము ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో కట్టామని, తీరా చూస్తే నరేష్ అనే వ్యక్తి మోసం చేశాడని తెలియడంతో మా డబ్బులు మాకు తిరిగివ్వాలని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని తెలిపారు బాధితులు. కొంతమందికి ఉద్యోగాల పేరుతో మూడు నెలల పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేయించాడని, కనీసం జీతాలు కూడా ఇవ్వలేదని వాపోయారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు బాధితులు.
ఓ వైపు లక్షలాది నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం రోజుకు 14 నుంచి 16 గంటల పాటు శ్రమించి చదువుతున్నారు. గత ఏడాది సీఎం కేసీఆర్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలతో పాటు పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. చెప్పినట్లుగానే కొన్ని రోజులకే ఒక్కొక్కటిగా గ్రూప్ 1, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఆపై గ్రూప్ 2, 3, 4 పోస్టులకు.. మెడికల్ డిపార్ట్ మెంట్ లోనూ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ కొందరు దళారులు చెప్పిన మాటలు విని నిరుద్యోగులు, అమాయక యువత మోసపోతుంది. ఉద్యోగాలు కచ్చితంగా నోటిఫికేషన్లు, ఆపై రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఇలా పూర్తి పద్ధతిలో జరుగుతాయని.. డబ్బులకు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెబితే నమ్మి మోసపోవద్దని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సైతం పలుమార్లు యువతను హెచ్చరించింది.
నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ
టెక్ మహీంద్ర ఫౌండేషన్, HCHW సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి కంప్యూటర్ శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించునున్నట్లు మేనేజర్ గౌస్ పాషా మార్చి 2న ఒక ప్రకటనలో తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగి ఉండి, వయసు 18-27 మధ్య వారు ఉచిత శిక్షణకు అర్హులు.
శిక్షణలో భాగంగా కంప్యూటర్ బేసిక్స్, ఎంఎస్-ఆఫీస్ 2010, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఇంగ్లిష్ టైపింగ్, కమ్యూనికేటివ్, ఇంటర్వ్యూ స్కిల్స్.. బీకాం ఉత్తీర్ణులకు టాలీ ప్రైమ్, బేసిక్ అక్కౌంట్స్, అడ్వాన్స్‌డ్ ఎంఎస్-ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహిస్తారు. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు మార్చి 15లోపు సంబంధిత ఫోన్ నంబర్లు:7674985461, 7093552020 ద్వారా తమ పేర్లు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.