Mlc Kavitha : నిజామాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన ఐటీ హబ్ వెబ్ సైట్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ కు సంబంధించిన వివరాలను బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్ గుప్తా ... కవితకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.... పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిదని, ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయన్నారు. నిజామాబాద్ యువతకు ఇది గుడ్ న్యూస్ అని, త్వరలో ఐటీ హబ్ ప్రారంభిస్తామని తెలిపారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
రూ.50 కోట్ల వ్యయంతో
యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా చేపట్టిన ఐటి హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అతి త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్ ప్రారంభిస్తామని తెలిపారు. ఇతర జిల్లాల ఐటీ హబ్ లతో పోల్చుకుని లోటుపాట్లను సరిదిద్ది నిజామాబాద్ ఐటీ హబ్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రూ. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్ లో 750 మంది యువతకు ఉపాధి అవకాశం లభించనుందని తెలిపారు. ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయన్నారు. దేశ వ్యాప్తంగా ఐటీ ఎక్స్ పోర్ట్స్ లో రెండవ స్థానంలో తెలంగాణ ఉందని కవిత వెల్లడించారు. ఐటీ హబ్ లో మూడు నుంచి నాలుగు వేల మంది ఇతర ప్రాంత వాసులకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. త్వరలో మరింత విస్తరిస్తామని అన్నారు. తెలంగాణలో ప్రజలు కలలు కన్న ప్రగతి సాధ్యమౌతుందని అన్నారు. భవిష్యత్ ప్రణాళికతో నిర్మాణాలు చేయించిన ఎమ్మెల్యే గణేష్, ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలకు అభినందనలు తెలిపారు. డిగ్రీ కళాశాలలతో ఒప్పందాలు పెట్టుకుంటామని అన్నారు. మరింత అభివృద్ధి సాధించేందుకు ముందుకెళతామన్నారు. జిల్లాలో విమానాశ్రయ ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ కవిత.
త్వరలో ఎయిర్ పోర్టు
"నిజామాబాద్ యువతకు లబ్ధి చేకూర్చేందుకు రూ.50 కోట్ల వ్యయంతో ఐటీ హబ్ నిర్మించాం. ఇందులో 750 మందికి ఉపాధి దొరుకుతుంది. ఐటీ జాబ్స్ క్రియేట్ చేయడంలో తెలంగాణ టాప్ ఉంది. ఐటీ జాబ్స్ వల్ల ఇతరులకు కూడా ఉపాధి దొరుకుతుంది. కేవలం హైదరాబాద్ కు మాత్రమే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా పరిశ్రమలు, ఐటీ హబ్ లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణలో మనం కలలు కన్న ప్రగతి ఇవాళ నిజం అవుతుంది. ఐటీ హబ్ నిర్మాణం త్వరలో పూర్తి అవుతుది. మంత్రి కేటీఆర్ సమయం తీసుకుని దీనిని ప్రారంభిస్తాం. ఐటీ హబ్ తో స్థానిక విద్యాసంస్థలతో ఒప్పందాలు చేసుకుంటాం. ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో ఎయిర్ పోర్టు కూడా ప్రణాళికలు చేస్తున్నాం" - ఎమ్మెల్సీ కవిత