సిజేరియన్ ఆపరేషన్లను నియంత్రిస్తూ... సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజీరియన్ కాన్పుల వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిజామాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలలో ఒకింత ఎక్కువ సంఖ్యలో సిజీరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, ఇది ఆరోగ్యకర సమాజాన్ని చేటు కలిగించే పరిణామంగా మారిందని ఆందోళన వెలిబుచ్చారు. వీటిని నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని వివరించారు.

 

గత మేలో జిల్లాలో సగటున 77 శాతం సిజీరియన్లు జరిగేవి కాగా, వాటిని ప్రస్తుతం 70 శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. ఇంకా వీటికి అడ్డుకట్ట వేస్తూ... సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలకు ప్రజల నుంచి కూడా సహకారం అవసరమని, ముఖ్యంగా గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కోరారు.

 

ఏ రకంగా చూసినా తల్లీ, బిడ్డకు సాధారణ ప్రసవాలు ఎంతో శ్రేయస్కరమని, పుట్టిన శిశువుకు అమృతంతో సమానంగా భావించే ముర్రుపాలు గంట వ్యవధిలోనే అందించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. సిజీరియన్ జరిగితే ఈ అవకాశం ఉండదని, తల్లీబిడ్డల ఆరోగ్యంపరంగా కూడా అనేక దుష్ప్రభావాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని గమనించి గర్భిణీలు, వారి కుటుంబీకులు సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు.

 

జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు 54 శాతం జరుగుతుండగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 90 శాతం అవుతున్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అవసరం లేకపోయినా సిజేరియన్లు చేస్తున్న ఆసుపత్రులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలతో పరిశీలన జరిపిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా సరైన వసతులు లేని రెండు ఆసుపత్రులను గుర్తించి సీజ్ చేశామని, శాశ్వత గైనకాలజిస్టులను ఏర్పాటు చేసుకోకుండానే ప్రసవాలు చేస్తున్న మరో 18 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తూ అవసరం లేకపోయినా సిజీరియన్లు చేసే ఆసుపత్రుల నిర్వాహకులను ఉపేక్షించబోమని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. 

 

ఓవైపు ప్రభుత్వం సిజేరియన్లకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నప్పటికీ వైద్య అధికారులు మాత్రం అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ... తర్వాత మమా అనిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 200కుపైగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయ్. జిల్లాలో ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే సిజేరియన్లు జరుగుతున్నాయ్. ఆరోగ్యవంతంగా ఉన్న గర్భిణిలకు కూడా సిజేరియన్లు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

 

నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో ప్రభుత్వ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో నార్మల్ ప్రసవాలు జరుగుతున్నాయ్. అదే ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం 90 శాతం సిజీరిన్లే అవుతున్నాయ్. సిజేరియన్ల వల్ల మహిళలకు ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయ్. మొదటిసారి కాన్పులో సిజేరియన్లు అవుతున్న వారికి రెండో కాన్ఫులోనూ తప్పని సరిగా సిజేరియన్ తోనే కాన్పులు చేస్తున్నారు. దీని వల్ల మహిళలు చాలా ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారన్నది వాస్తవం. ఓ వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నేచురల్ ప్రసవాలపై యోగా, వ్యాయామం చేయిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. 

 

ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాగానే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న గర్భిణీలకు న్యాచురల్ ప్రసవాలకు సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ చెప్పటం లేదు. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రుల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో గర్భిణీలు నెల నెలా చికిత్సకు వెళ్తే వారికి తప్పనిసరిగా సిజేరియన్లకే వైద్యులు ప్రోత్సహిస్తున్నారు. అదే ప్రభుత్వ ఆస్పత్రులు పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయ్. ప్రైవేట్ అస్పత్రుల్లోనే ఇలా ఎందుకు జరుగుతున్నాయ్ అన్న దానిపై జిల్లా వైద్య శాఖ దృష్టిపెట్టడం లేదు. సిజేరియన్లను అరికట్టడంలో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలపై ఏబీపీ దేశం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని అడిగిన ప్రశ్నకు సమాధానం దాటవేశారు. తెలంగాణలోనే నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కువగా సిజేరియన్లు జరుగుతున్నాయ్. వేల రూపాయల్లో ఫీజులు దండుకుంటున్నారు. కానీ జిల్లా వైద్య శాఖ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నా... ప్రైవేట్ ఆస్పత్రుల వారితో కుమ్మక్కవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. సిజేరియన్లపై కనీసం ప్రైవేట్ ఆస్పత్రుల్లో సూచిక బోర్డులు కూడా పెట్టడం లేదు. ఆస్పత్రులకు వచ్చే గర్భిణులకు నార్మల్ ప్రసవాలపై కనీస  అవగాహన కూడా ఇవ్వటం లేదు.