YS Sharmila Padayatra: వచ్చే ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపిస్తే పంట రుణాలు మాఫీ చేస్తానని, సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్, పిట్లం మండలాల మీదుగా సాగింది. పిట్లంలో ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అందుకే కేసీఆర్ క‌ట్టిన కాళేశ్వ‌రం మూడేళ్లకే మునిగి పోయిందన్నారు. నాణ్యత లేని పనులు చేసినా కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేసీఆర్, ఆ కంపెనీ ప్రజల సొమ్మును పీక్కుతిన్నారని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టులో అడుగ‌డుగునా ఇంజినీరింగ్ లోపాలు క‌న‌ప‌డుతున్నాయన్నారు. 






కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బుతోనే ప్రత్యేక విమానం..


సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ఒక ఏటీఎంలా ప‌ని చేస్తుంద‌ని, కాళేశ్వ‌రంతో వేల కోట్లు సంపాదించారని చెప్తున్నా కేంద్ర బీజేపీ పెద్ద‌లు ఎందుకు విచార‌ణ జ‌రిపించ‌డం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉండి కూడా ఎందుకు ఎంక్వైరీ చేయించడం లేదని అడిగారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బులతోనే సీఎం కేసీఆర్ ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అభివృద్ధిని విస్మరించి దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్ ముందుకెళ్తున్నారని ఆరోపించారు. 


వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గట్టిగా బుద్ధి చెప్పాలి..


డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి ఇస్తానన్న కేసీఆర్ ప్రజలను మోసం చేశారని వైఎస్ షర్మిల అన్నారు.  ప్రజాసమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే తాగుబోతు రాష్ట్ర సమితిని బందిపోట్ల రాష్ట్ర సమితిగా మార్చారని సెటైర్లు వేశారు. మునుగోడు ఉపఎన్నిక ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా రాలేదని తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఒక ఎమ్మెల్యేతో లోపాయికార ఒప్పందం కుదుర్చుకుంటే ఈ ఉపఎన్నిక‌ వ‌చ్చిందని అన్నారు. అయిదేళ్లు సేవ చేస్తాన‌ని వాగ్ధానం చేసిన ఎమ్మెల్యే మ‌ధ్య‌లోనే త‌న స్వార్థం కోసం వేరే పార్టీలోకి వెళ్లిపోయారన్నారు.


బీఆర్ఎస్ పార్టీ అహంకారం చాటుకోవ‌డానికి మునుగోడు ఉపఎన్నిక‌లో వేల కోట్లు డ‌బ్బు ఖ‌ర్చు చేస్తోందని తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక ప్ర‌జ‌ల కోసం వ‌చ్చిన ఎన్నిక కాదని... ఇది మూడు పార్టీల మ‌ధ్య వీధిలో కుక్క‌ల కోట్లాట‌లా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు గట్టిగా బుద్ది చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 


అధికారమిస్తే.. వైఎస్ బిడ్డగా పాలన..


దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సువర్ణ పాలన కోసం తమ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రాంరెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్‌ అంటేనే వ్యవసాయమని అభిప్రాయపడ్డారు. అనేక ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని విరించారు. ఆయన బిడ్డగా తాను కూడా అదే బాటలో నడుస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చేలా దీవించమని ఓటర్లను కోరారు.