ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ లో బుధవారం (అక్టోబరు 12) రాత్రి భూమి కంపించింది. భూమి కుదుపులకు లోను కావడంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఉట్నూర్లోని, వజీర్ పురా, మోమిన్ పురా, ఫకిర్ గుట్టా ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు భూమి కంపించిందని పిల్ల పాపలతో బయటకు పరుగులు తీశారు. 


బుధవారం (అక్టోబరు 12) రాత్రి 11:12 గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో తమ ఇళ్ళలో ఏదో కదిలినట్లుగా అనిపించిందని, వెంటనే అందరం బయటకు పరుగులు తీశామని స్థానికులు చెప్పారు. వారిని చూసిన స్థానికులు అందరూ రోడ్లపైకి వచ్చి ఒక చోట చేరారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా ఉట్నూర్ మొత్తం వ్యాపించింది. ఉట్నూరులో భూమి కంపించడం ఇది రెండోసారి. 


గత ఆరేళ్ల కిందట 2016 లో ఇలాగే ఉదయంపూట భూమి కంపించింది. తిరిగి మళ్ళీ ఈ రోజు రాత్రిపూట భూమి కంపించడంపై ఉట్నూరు వాసులు భయాందోళనకు గురయ్యారు. ఉట్నూరులోని ఆయా విధుల్లో రాత్రి గంటపాటు అంతా భయపడుతూ బయటే ఉండిపోయారు. అనంతరం కొంతమంది ధైర్యంగా ముందుకు వచ్చి భూమి కంపించడంతో ఏమీకాదని, అందరు వెళ్ళి పడుకోవాలని సర్ది చెప్పుకున్నారు. క్రమంగా భయం నుంచి తేరుకొని రోడ్ల పైకి వచ్చిన జనం మెల్లమెల్లగా తమ ఇళ్ళలోకి వెళ్లి పడుకున్నారు.