ఇందూరు ఆడబిడ్డలు ఆటల్లోనే కాదు చదువుల్లోనూ సత్తా చాటుతున్నారు. క్రీడల్లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ జిల్లాకు పేరు తెస్తే... ప్రస్తుతం సివిల్స్‌లో 136వ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లాకు గౌరవం తెచ్చింది అరుగుల స్నేహ. మూడు సార్లు సివిల్స్‌లో పోరాడిన తర్వాత నాలుగోసారి సివిల్స్‌లో విజయం సాధించారు స్నేహ.


మొక్కవోని విశ్వాసంతో సివిల్స్ ర్యాంక్ సాధించే వరకు పోరాటం చేశారు స్నేహ. చివరికి సక్సెస్ అయ్యారు. చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలన్న లక్ష్యం పెట్టుకుని చివరికి టార్గెట్ రీచ్ అయ్యారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ... థర్డ క్లాస్ నుంచి 10 వరకు నిర్మల హృదయ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఎప్పుడు 90 శాతం మార్కులతో బ్రయిట్ స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు స్నేహ. ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లో చదివారు.


నాగ్ పూర్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 2017లో పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే స్నేహ సివిల్స్ వైపు దృష్టి సారించారు. దిల్లీ వెళ్లి ప్రిపరేషన్ మొదలుపెట్టారు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా అర్హత పొందలేదు. అయినా నిరుత్సాహపడకుండా రెండో ప్రయత్నంలో మెయిన్స్ వరకు వెళ్లారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణత కాలేదు. మూడో అటెంప్ట్‌లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఒక్క మార్కు తేడాతో ర్యాంకు కోల్పోయారు. రెట్టించిన ఉత్సాహంతో నాలుగో ప్రయత్నంలో స్నేహ విజయం దక్కించుకున్నారు.


ఒడిదొడుకులను ఎదుర్కోని నిలబడ్డ స్నేహ


స్నేహ తల్లి పద్మ, చెల్లెలు సుప్రియ. తల్లి పద్మ కామారెడ్డి కలెక్టరేట్‌లోని పే అండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌. చెల్లెలు సుప్రియ హైదరాబాద్‌లో సంగీతం టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తన తల్లి అనేక కష్టాలు పడుతూ తనను ఈ విజయం సాధించేందుకు ప్రోత్సహించినట్లు స్నేహ తెలిపారు. చివరి రెండేళ్లలో తన చెల్లెలు సుప్రియ సైతం ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహించినట్లు స్నేహ పేర్కొన్నారు. స్నేహ చిన్నతనంలో కుటుంబ పోషణ తల్లికి భారంగా ఉండేది. నాటి కలెక్టర్ విజయ్ కుమార్ స్నేహ తల్లికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. అనాటి నుంచి కొంత ఆర్థిక పరిస్థితి కుదుట పడ్డారు. స్నేహ కష్టాలను లెక్క చేయకుండా చదువుపై దృష్టి పెట్టారు. తాను చిన్న వయసులో కలెక్టర్ విజయ్ కుమార్ చేసిన సాయాన్ని దృష్టిలో పెట్టుకుని తాను సైతం కలెక్టర్ కావాలను టార్గెట్ పెట్టుకున్న స్నేహ తన కలను నిజం చేసుకుంది. మహిళల అభ్యున్నతికి కృషి చేస్తానంటున్నారు.


స్నేహకు బయోపిక్స్ చూడడం హాబీ. జీవితంలో తాను నేర్చుకున్న అంశాలు, ఎదురైన అనుభవాల గురించి రాయడం అలవాటు అని తెలిపారు. ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అమ్మ ఎంతో ప్రోత్సాహం ఇస్తూ వచ్చారు. ఈ విజయం సాధించడానికి స్ఫూర్తి అమ్మే అంటున్నారు స్నేహ. ఈ విజయం అమ్మకు అంకితం. చెల్లి సుప్రియ మ్యూజిక్ టీచర్ గా పని చేస్తే వచ్చిన డబ్బులను తన అవసరాల కోసం గత రెండేళ్లుగా పంపి మరింతగా ప్రోత్సహించారని తెలిపారు స్నేహ. హైదరాబాద్‌లో ఉండే పిన్ని, బాబాయి సైతం ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి అమ్మ ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. సర్వీసులో చేరాక మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారిస్తానని తెలిపారు స్నేహ.