38ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్... పీకేను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందో కేసీఆర్‌ చెప్పాలన్నారు మాజీ మంత్రి ఈటల రాజేంద్ర. ప్రజల మధ్యకు వెళ్లే దమ్ములేక ఇవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. 
కేసీఆర్ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారన్నారు. మల్లారెడ్డిపై జరిగిన దాడి అందుకు ఉదాహరణగా అభివర్ణించారు. అది మల్లారెడ్డిపై జరిగిన దాడి కాదని... టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని గుర్తు చేశారు ఈటల. 


అందరూ దూరమే: ఈటల


దళితుడిని కాదని సీఎం కుర్చీ ఎక్కి... వాళ్ల జీవితాల్లో కేసీఆర్ మట్టికొట్టారన్నారని ఆరోపించారు ఈటల రాజేందర్. అనేక హామీలిచ్చి అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఆగ్రహానికి గురయ్యారన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు అని చెప్పి పీఠముడి వేసి రాకుండా చేశారని ఘాటుగా విమర్శించారు. బీసీలకు కూడా అన్ని రకాలుగా అన్యాయం చేసి వాళ్లకు దూరమయ్యారన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు అన్ని కులాలు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యాయని తెలిపారు.


వ్యతిరేకతతోనే మల్లారెడ్డిపై దాడి: ఈటల 


రుణమాఫీ చేయక రైతులను డిఫాల్టర్లుగా మార్చారని ఆరోపించారు. నీళ్లున్నా పంట సాగు చేయలేని దుస్థితి కల్పించిన ఘనత కేసీఆర్‌ది అన్నారు ఈటల. ప్రతి గింజా కొంటామని చెప్పిన కేసీఆర్... వర్షాలు పడి వరద పాలవుతుంటే పది కిలోల కడ్తా తీసి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రెడ్ల గర్జనలో మల్లారెడ్డిపై దాడి వ్యక్తిగతం కాదన్న ఈటల... ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేకతని అభిప్రాయపడ్డారు. 


అందుకే ఎన్టీఆర్‌కు నివాళి: ఈటల


గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ లీడర్లు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్‌కు నివాళులర్పించారని ఆరోపించారు ఈటల. టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల ప్రాణాలకు సైతం రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టు ఉంది ధరణి పోర్టల్‌ దుస్థితి అని మండిపడ్డారు. పరువు హత్యలు జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లేదంటే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. 


కేసీఆర్ తప్పుకో: ఈటల


టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్న వారిని పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు ఈటల. ప్రజా సమస్యలు ఏంటో తెలుసుకోవడం లేదని.. శాంతిభద్రతలు కాపాడచంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆయన తక్షణమే కేసీఆర్ పదవికి రాజీనామా చేసి పాలన చేతకాదని ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని కోరారు ఈటల. 


తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా ఏమీ బాగాలేదన్నా ఈటల... పూర్తిగా దివాళా తీస్తోందన్నారు. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మొత్తం బోగస్ అన్నారు. 90శాతం నిజమని హరీష్ రావు చెప్పినా... ముక్కు నేలకు రాస్తానని సవాల్ చేశారు ఈటల. ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 


మనమెందుకు గౌరవించాలి: ఈటల


సీఎం కుర్చీలో కూర్చుని ఆ పదవీ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలి తప్ప వ్యక్తిగత విషయాల కోసం కాదన్నారు ఈటల. ప్రధాని వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే సంస్కారం లేదని దుయ్యబట్టారు. గవర్నర్‌కి కూడా మర్యాద ఇవ్వడం లేదన్నారు. ఇతరులను గౌరవించలేని వ్యక్తిని ప్రజలకు కూడా గౌరవించాల్సిన అవసరం లేదని పిలుపునిచ్చారు ఈటల. ప్రధానిపై కాంగ్రెస్‌ నేతలు చేసే విమర్శలను ఖండించే సీఎం కేసీఆర్... తను మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. 


వచ్చిన పరిశ్రమలెన్నీ ఇచ్చిన ఉద్యోగాలెన్నీ: ఈటల


తెలంగాణలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి... అందులో ఎంత మంది తెలంగాణ వాళ్లు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు ఈటల. చిన్న చిన్న లిఫ్ట్ బాయ్ వంటి ఉద్యోగాలను మాత్రమే తెలంగాణ వాళ్లకు ఇస్తున్నారన్నారు. ఇక్కడ కంపెనీలు పెడుతున్నవారు... అనేక రాయితీలు అడుగుతారన్నారని... స్థానికులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. ఏ పరిశ్రమ కూడా ేదో రాష్ట్రాన్ని ఉద్దరించడానికి రాదన్న ఈటల... తమ లాభాల కోసమే వస్తారన్నారు. 


అప్పుడు చంద్రబాబు- ఇప్పుడు చంద్రశేఖర్: ఈటల


2018 కంటే ముందు కూడా దేశం మొత్తం చక్రం తిప్పుతానంటూ బయల్దేరిన కేసీఆర్‌ తర్వాత ఎందుకు సైలెంట్‌ అయిపోయారో చెప్పాలన్నారు ఈటల. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని మళ్లీ ఎన్నికలైతే పత్తా ఉండరన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే తిరిగారని... ఇప్పుడు ఆయన ఏమయ్యాడో అందరూ చూస్తున్నారన్నారు. ఎవరు పిలవకున్నా... ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు.