UPSC Civisl Results 2022 : యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. సివిల్స్-2021 తుది ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి. శృతి శ‌ర్మకు ఆలిండియా ఫ‌స్ట్ ర్యాంక్ సాధించగా, అంకితా అగ‌ర్వాల్‌, గామిని సింగ్లాల‌కు రెండో, మూడో ర్యాంక్‌లు దక్కాయి. ఈ ఏడాది సివిల్స్ లో 685 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారని యూపీఎస్సీ పేర్కొంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంకు సాధించారు. పూసపాటి సాహిత్య(24 ర్యాంక్), కొప్పిశెట్టి కిరణ్మయి(56 ర్యాంక్), శ్రీపూజ(62 ర్యాంక్), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి(69 ర్యాంక్), ఆకునూరి నరేశ్(117 ర్యాంక్), అరుగుల స్నేహ(136 ర్యాంక్), బి.చైతన్య రెడ్డి(161 ర్యాంక్), ఎస్.కమలేశ్వర్ రావు(297), విద్యామరి శ్రీధర్‌(336), దిబ్బడ అశోక్‌(350), గూగులావత్‌ శరత్‌ నాయక్‌(374), నల్లమోతు బాలకృష్ణ(420), ఉప్పులూరి చైతన్య(470), మన్యాల అనిరుధ్‌(564), బిడ్డి అఖిల్‌(566), రంజిత్‌ కుమార్‌(574), పాండు విల్సన్‌(602), బాణావాత్‌ అరవింద్‌(623), బచ్చు స్మరణ్‌రాజ్‌(676) ర్యాంకులు సాధించారు. 


అంగన్వాడీ కార్యకర్త బిడ్డకు ర్యాంక్ 


వరంగల్ జిల్లాకు చెందిన బొక్క చైతన్య రెడ్డికి సివిల్స్ లో 161 ర్యాంక్ సాధించారు. ఈమె తండ్రి బి.సంజీవ రెడ్డి వరంగల్ డీసీవోగా పనిచేశారు. ప్రస్తుతం చైతన్య నీటిపారుదల శాఖలో ఏ.ఈ గా పనిచేస్తున్నారు. మరో అమ్మాయి తిరుమాని శ్రీపూజ సివిల్ సర్వీసెస్ ఆలిండియా 62వ ర్యాంక్ దక్కించుకున్నారు. తండ్రి వెంకటేశ్వర్లు పంచాయితీరాజ్ శాఖలో పనిచేస్తున్నారు. ఆమె స్వగ్రామం భీమవరం మండలం దొంగపిండి గ్రామం. ఇక జగిత్యాల జిల్లాకు చెందిన గూగులావత్ శరత్ నాయక్ సివిల్స్ లో 374వ ర్యాంక్ సాధించారు. శరత్ స్వగ్రామం బీర్పూరర్ మండలంలోని చర్లపల్లి గ్రామం. తండ్రి భాస్య నాయక్ ఓ రైతు. తల్లి యమున మినీ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నారు. నిజమాబాద్ కు చెందిన అరుగుల స్నేహ 136వ ర్యాంక్ సాధించారు. మద్యానికి బానిసైన తండ్రి వారిని విడిచి పెట్టడంతో స్నేహ తల్లి బాధ్యత తీసుకుని పెంచి, పెద్ద చేసింది. స్వయంసహాయక బృందాల సహాయంతో ఆమె సివిల్స్ కు ప్రిపేర్ అయింది. ఇటీవల కలెక్టర్ బినయ్ కుమార్ ఆమెకు మాక్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇప్పుడు స్నేహ 136వ ర్యాంక్ సాధించడంపై ఆమె తల్లి, గ్రామస్థులు ఆనందం వ్యక్తంచేశారు.  


రాజమహేంద్రవరం యువకుడికి 99వ ర్యాంక్ 


సివిల్స్ లో రాజమహేంద్రవరం కు చెందిన యువకుడు  ప్రతిభ కనబరిచారు. ఆల్ ఇండియా సివిల్ ర్యాంక్ 99 సాధించారు. రాజమహేంద్రవరం ఎల్ఐసీలో క్లర్కుగా పనిచేస్తున్న  రవి కుమార్ పట్నాయక్, వైజాగ్ ఫుడ్స్ లో డైరెక్టర్ గా పని చేస్తున్న శారదా రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడైన తరుణ్ పట్నాయక్ మొదటి నుంచి విద్యలో ప్రతిభ చూపించేవారు. తరుణ్ మెకానికల్ ఇంజినీరింగ్ ను ఐ.ఐ.టి గౌహతిలో చదివారు. ఈ ఏడాది నిర్వహించిన సివిల్స్ పరీక్షలో దేశవ్యాప్తంగా 99వ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రి రవి కుమార్ పట్నాయక్ చేస్తున్న సేవాకార్యక్రమాల ద్వారా స్పూర్తి పొందిన తరుణ్ పట్నాయక్ ప్రజలకు సేవలు చెయ్యాలని కలలు కనేవారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం చదువుకోడానికి కేటాయించేవారు. ఎలాగైనా సివిల్స్ సాధించాలనే లక్ష్యంతో దిల్లీలో శిక్షణ పొంది సివిల్స్ లో విజయం సాధించారు. తరుణ్ పట్నాయక్ సివిల్స్ లో ర్యాంక్ సాధించడం పట్ల రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయ లక్ష్మితో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు.


30 లక్షల ప్యాకేజ్ వదులుకుని 


సివిల్స్ పరీక్షల్లో పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామానికి చెందిన కన్నెధార మనోజ్ కుమార్ సత్తాచాటారు. ఆలిండియా స్థాయిలో 157వ ర్యాంకు సాధించారు. ఆయన తండ్రి హనుమయ్య వృత్తి న్యాయవాది. చిన్నప్పటి నుంచే చదువుల్లో ప్రతిభ కనబర్చిన మనోజ్ కుమార్ పెదకూరపాడులో స్కూల్ విద్యని, గుంటూరు భాష్యం కళాశాలలో ఇంటర్ విద్యని,  తిరుపతి ఐఐటీలో  ఇంజనీరింగ్ విద్యని పూర్తి చేశారు. అనంతరం 30 లక్షల రూపాయల ప్యాకేజ్ తో ఓ ప్రైవైట్ కంపెనీలో ఉద్యోగం సాధించారు. ప్రజలకి సేవలందించాలన్న లక్ష్యంతో సివిల్స్ ని ఎంపిక చేసుకొని రెండో ప్రయత్నంలో సివిల్స్ కి అర్హత సాధించారు. దీంతో ఆయన తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.