దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాటపర్వం'. ఈ సినిమాను వేణు ఊడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. సెకండ్ వేవ్ తరువాత సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్2' లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా థియేటర్లలో సందడి చేశాయి. 


కానీ 'విరాటపర్వం' సినిమాకి మాత్రం మోక్షం కలగలేదు. దీంతో ఓటీటీలో రిలీజ్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలను ఖండించారు దర్శకుడు. ఈ సినిమాను కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు. దానికి తగ్గట్లుగానే జూలై 1న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమాను చెప్పినదానికంటే ముందుగానే రిలీజ్ చేయబోతున్నారు. 







జూన్ 17న 'విరాటపర్వం' రిలీజ్ అవుతుందని ప్రకటించారు. వాయిదాల మీద వాయిదా పడ్డ ఈ సినిమాపై బజ్ కాస్త తగ్గింది. మరో 17 రోజుల్లో రిలీజ్ అంటే ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తేనే కానీ సినిమాకి ఓపెనింగ్స్ రావు. మరి దర్శకనిర్మాతలు ఎలా ప్లాన్ చేస్తున్నారో తెలియాల్సివుంది. 


'విరాట పర్వం'లో మావోయిస్టు పాత్రలో రానా కనిపించనున్నారు. ఆయన్ను ప్రేమించే అమ్మాయి పాత్రలో సాయి పల్లవి నటించారు. సాయుధ పోరాటంతో పాటు వీళ్ళిద్దరి మధ్య ప్రేమకథకూ సినిమాలో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ వంటి భారీ తారాగణం నటిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.


Also Read: పాకిస్తానీ సినిమాకు Cannes 2022లో అవార్డులు - 'జాయ్ ల్యాండ్' ప్రత్యేకత ఏంటి?


Also Read: 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?