MP Vijaysai Reddy : వైసీపీ అధికారం చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు విజయవాడ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి కేక్ కట్ చేశారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, పలువురు మేయర్లు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఇది మాట తప్పని ప్రభుత్వం అన్నారు. సామాజిక న్యాయం పాటిస్తూ, పరిపాలన సౌలభ్యం కోసం సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం అన్నారు. రూ.1.42 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు. రైతుభరోసా వంటి పథకాలతో రైతులకు చేరువైన ప్రభుత్వం అన్నారు.
బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజం
అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన
2019లో ఎలా పనిచేశామో 2024లో కూడా అంతకుమించి పని చేసి మళ్లీ జగన్ ని సీఎం చేసుకోవాలని విజయసాయి రెడ్డి అన్నారు. అమలాపురం ఘటన వెనుక టీడీపీ, జనసేన హస్తం ఉందని ఆరోపించారు. పాత్రదారులు, సూత్రదారులు అందర్నీ అరెస్టు చేస్తామన్నారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టమని అన్ని పార్టీలూ అడిగాయన్నారు. జనసేన దీక్షలు చేస్తే, అధికారంలోకి వస్తే మేమే పెడతామని టీడీపీ చెప్పిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ పేరును వైసీపీ పెడితే కావాలనే గొడవలు చేశారని ఆరోపించారు. అంబేడ్కర్ పేరు పెట్టవద్దని ఆ పార్టీలు చెప్పగలవా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత సీఎం జగన్ దక్కుతుందన్నారు. అమలాపురం ఘటనను చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనీసం ఖండించలేదన్నారు.
దీనికి కారణం ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
2024 ఎన్నికలు టీడీపీకి చివరివి
సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలు 96 శాతం పూర్తి చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నేటితో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నివాసం వద్ద పార్టీ జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు. అనంతరం అటవీ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నేరవేర్చిన ముఖ్యమంత్రుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరని కొనియాడారు. ప్రభుత్వంపై ఎల్లో మీడియా కుట్ర పూరితంగా బురద జల్లుతోందన్నారు. వైసీపీపై పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతపురం జిల్లాలో బస్సు యాత్రకు అపూర్వ స్పందన వచ్చిందని, ప్రతిపక్షాలు నిర్మాణాత్మక విమర్శలు చేయాలని చెప్పారు. వైసీపీ నాయకులను అరేయ్ తురేయ్ అంటూ మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు సంస్కారహీనుడని, రాబోవు ఎన్నికల్లో 175 సీట్లు వైసీపీ కైవసం చేసుకోనున్నట్లు ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలు టీడీపీకి చివరి ఎన్నికలు అని ఆయన జోష్యం చెప్పారు.