Narnur Panchayat: ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్‌ గ్రామం. గత మూడు తరాలుగా ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది. నార్నూర్‌ కొత్త రూపురేఖలను మార్చుకుంటోంది. నార్నూర్‌ పంచాయతీ సర్పంచ్ గా గత మూడు సార్లు గెలిచిన సర్పంచ్ గజానంద్ నాయక్ తన స్వశక్తితో గ్రామాన్ని అభివృద్ధి చేస్తు గ్రామంలో భారీ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మార్గంలో నడుస్తూ గ్రామంలో అందరిని కలుపుకొని ఎలాంటి బేధాలు లేకుండా అందరు సమానంగా కలిసికట్టుగా ఉండేలా తమ నార్నూర్‌ గ్రామాన్ని అభివృద్ధి పరుస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నార్నూర్‌ పంచాయతీలోని ప్రతి వాడల్లో సీసీ రోడ్లు, కాలనీల్లో ప్రత్యేక వెల్ కమ్ కమాన్ లు, వీది అరుగులు, కూర్చీలు, ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాలో ఎక్కడ లేని డిజిటల్ మార్కెట్ ను నార్నూర్‌ లో ఏర్పాటు చేసారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, హరిత హారం కార్యక్రమంలో భాగంగా రోడ్డుకిరువైపులా చెట్లు, పల్లె ప్రకృతి వనంలో అందమైన హరిత వనాన్ని ఏర్పాటు చేశారు. ఇలా పంచాయతీలో పలు అభివృద్ధి పనులు చేస్తు గాంధీ  బాటలో నడుస్తు నార్నూర్‌ ను అభివృద్ధి చేస్తున్నారు.


గాంధీ మార్గంలో నార్నూర్..


నార్నూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఓ ప్రత్యేకతను చాటుకునేలా రూపుదిద్దారు సర్పంచ్ గజానంద్ నాయక్. పంచాయతీకి గ్రామ పార్లమెంటు నామకరణంతో పాటు పంచాయతీ ఆవరణలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేసారు. ఏటా అక్టోబర్ 2 న గాంధీ జయంతి వేడుకలను గ్రామస్తులతో కలిసి ఘనంగా నిర్వహిస్తున్నారు. నార్నూర్‌ నడిబొడ్డున భారీ గాందీ విగ్రహంతో పాటు ఆయా కాలనీల్లో మహనీయుల విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు. గాంధీ బాటలో నడుస్తు పంచాయతీని అభివృద్ధి చేస్తున్న సర్పంచ్ ను గ్రామస్తులు అభినందిస్తు ఏటా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. 


స్వచ్ఛ్ నార్నూర్..


పంచాయతీ కార్యాలయాన్నీ ఓ మినీ సచివాలయంగా.. పచ్చనైన వనంలో మొక్కలు నాటి అందమైన అలంకరణలతో పంచాయితీ కార్యాలయం నిర్మించారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ గ్రామంలో అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. అందరి మనస్సులలో నార్నూర్‌ గాంధీ గా చోటు సంపాదించుకున్నారు సర్పంచ్ గజానంద్ నాయక్. నార్నూర్ ను జిల్లాలోనే అత్యంత స్వచ్ఛమైన గ్రామంగా అభివృద్ధి చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. గత 2006 నుండి 2020 వరకు నార్నూర్‌ పంచాయతీ సర్పంచ్ గా గజానంద్ నాయక్ కొనసాగుతున్నారు. జిల్లా కలెక్టర్ల తో పాటు అయా మంత్రుల చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్ గా పలు అవార్డులు సైతం అందుకున్నారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు గెలిపించి తమ నార్నూర్ పంచాయతీ మహార్దశను మార్చుకుంటున్నారని చిన్న పెద్ద తేడా లేకుండా ఏ సమయంలోనైనా తమని ఎలాంటి కష్టాల కడలిలోనైనా ఆదరించి ఆదుకునే నేతగా గజానంద్ తమకు సహాయపడుతున్నారని గ్రామస్థులు అంటున్నారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం కోసం వారు పాటుపడుతున్నారని, మహాత్మా గాంధీ భారీ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడంతో పాటు గాంధీజీ బాటలో నడుస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేయడంపై పంచాయితీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.