Hyderabad News: భాగ్యనగరంలో ఉగ్ర కుట్రను సిట్ పోలీసులు భగ్నం చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో క్రియాశీలకంగా ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంలో హైదరాబాద్ ముసారాంబాగ్ లో నివాసం ఉంటున్న జావేద్ ను సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో బేగంపేటలోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన బాంబు దాడి కేసులో జావేద్ ను నిందితుడిగా అనుమానించి విచారించారు. అర్ధరాత్రి, మూసారాంబాగ్ తో పాటు చంపాపేట్, సైదాబాద్, బాబానగర్, సంతోష్ నగర్ లోని మరికొందరి ఇళ్లలో కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయంతో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ముగ్గుర్ని అరెస్టు చేశారు. ఉగ్ర దాడుల కోసం కొంతమంది యువకులను జావేద్ ఇప్పటికే రిక్రూట్ చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 



నాలుగు హ్యాండ్ గ్రనేడ్ లు స్వాధీనం 


హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రచేశారన్న సమాచారంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నాలుగు హ్యాండ్‌ గ్రనేడ్‌లు, రూ.5.41 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ ముసారాంబాగ్‌లో ఉంటున్న అబ్దుల్‌ జాహెద్‌ను సిట్‌ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం అర్ధరాత్రి ముసారాంబాగ్‌తో పాటు చంపాపేట్‌, సైదాబాద్‌, బాబానగర్‌, సంతోష్‌ నగర్‌లోని పలువురి ఇళ్లలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సాయంతో సిట్‌ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల అనంతరం జాహెద్‌తో పాటు సైదాబాద్‌ కు చెందిన సమీరుద్దీన్‌, మెహదీపట్నానికి చెందిన హసన్‌ ఫారూఖీని అరెస్టు చేశారు.


ఐఎస్ఐతో సంబంధాలు


జాహెద్ పాకిస్తాన్ ఐఎస్‌ఐతో మళ్లీ సంబంధాలను పునరుద్ధరించుకున్నాడని, హైదరాబాద్ నగరంలో పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు సహా తీవ్రవాద చర్యలకు కుట్ర పన్నాడని పోలీసులు తెలిపారు.  పక్కా సమాచారంతో పోలీసులు అబ్దుల్ జాహెద్‌తో పాటు అతని సహచరులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు సమీయుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీ,  మాజ్ హసన్ ఫరూక్ అలియాస్ మాజ్ గా పోలీసులు గుర్తించారు. అబ్దుల్ జాహెద్ కు 2005లో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడితో సహా హైదరాబాద్‌లోని అనేక ఉగ్రవాద సంబంధిత కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. జాహెద్ పాకిస్తాన్ ISI-LeT హ్యాండ్లర్‌లతో తరచుగా టచ్‌లో ఉండేవాడన్నారు. 


మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ముగ్గురు అరెస్ట్!


హైదరాబాద్ లో దాడులకు తెగబడి మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర చేస్తున్నారని, ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే సిట్ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది.  ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారన్న ఆరోపణలతో పీఎఫ్ఐపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ముగ్గుర్ని అరెస్ట్ చేసింది. ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారంటూ పీఎఫ్ఐపై నిజామాబాద్ లో పోలీసులు తొలుత కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 


పలు పత్రాలు, హార్డ్ డిస్కులు, నగదు స్వాధీనం.. 


ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అధికారులు గతంలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు. గత ఆదివారం రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఈ సందర్భంగా పలు పత్రాలు, హార్డ్ డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బోధన్ కు చెందిన సయ్యద్ సమీర్, ఆదిలాబాద్ కు చెందిన ఫిరోజ్, జగిత్యాలకు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ అహ్మద్, నెల్లూరుకు చెందిన ఎండీ ఉస్మాన్ లను అరెస్ట్ చేసి నాంపల్లిలోని నాలుగో అదనపు మున్సిపల్ సెషన్స్ జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఇప్పటికే పీఎఫ్ఐపై కేంద్రం నిషేధం విధించింది. పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


వందలాది మంది కార్యకర్తలు


యూఏపీఏ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను అందించడంతోపాటు యువతకు శిక్షణ ఇస్తున్నారనే ఆరోపణలపై పీఎఫ్ఐ కార్యాలయాలపై దేశ వ్యాప్తంగా భారీ ఆపరేషన్ ను కేంద్ర హోంశాఖ చేపట్టిన విషయం తెలిసిందే. ఎన్ఐఏ ఆధ్వర్యంలో పలుచోట్ల దాడులు కూడా నిర్వహించారు. వందలాది మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేశారు.  


Also Read : KCR Speech: వెకిలి వ్యక్తుల ప్రయత్నాలతో ఆయన ప్రభ ఏనాటికీ తగ్గదు - వాళ్లు మహాత్ములు కాలేరు: కేసీఆర్