Watch Video: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఓ ఆగంతకుడు ప్లాస్టిక్ బాటిల్ విసిరాడు. గుజరాత్‌లో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






ఇదీ జరిగింది


రాజ్‌కోట్ సిటీలో నవరాత్రి వేడుకల్లో భాగంగా జరుగుతున్న ఓ గార్బా ఈవెంట్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో గార్బా నృత్యంలో పాల్గొన్న వారిని కలిసేందుకు కేజ్రీవాల్ వెళ్తున్నట్లు కనిపిస్తోంది. వెనుక వైపు నుంచి ఎవరో వాటర్ బాటిల్ విసిరారు. అయితే ఆ బాటిల్ కేజ్రీవాల్‌కు తగలకుండా తల మీద నుంచి వెళ్లిపోయింది.


అయితే కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని బాటిల్ విసిరినట్టు కనిపిస్తోందని పార్టీ నేతలు అన్నారు. ఈ మేరకు ఆప్ మీడియా కో ఆర్డినేటర్ సుకంజ్‌రాజ్ తెలిపారు.


టార్గెట్ గుజరాత్


దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌ ఎన్నికలను టార్గెట్ చేసుకున్నారు. భాజపా పరిపాలనలో గుజరాత్‌ అవినీతిమయంగా మారిందని విమర్శించారు. రాష్ట్ర నేతలందరూ అవినీతికి పాల్పడుతున్నారని మండి పడ్డారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుని స్విస్‌బ్యాంక్‌లో దాచుకుంటున్నారని ఆరోపించారు. ఆప్ అధికారంలోకి వస్తే ఆ డబ్బునంతా వెనక్కి రప్పిస్తుందని హామీ ఇచ్చారు. గుజరాత్‌లో రెండ్రోజుల పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ శరవేగంగా ప్రచారం చేపడుతున్నారు. హామీల వర్షం కురిపిస్తున్నారు.


దిల్లీ తరహాలోనే గుజరాత్‌ వ్యాప్తంగా 20 వేల మొహల్లా క్లినిక్‌లు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ప్రతి గ్రామంలోనూ ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు అందరికీ పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ ఇలా సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. అంతే కాదు. ఆప్‌నకు రాష్ట్రంలో భారీ మెజార్టీ వస్తుందని జోస్యం చెబుతున్నారు. భాజపా చేయించిన ఓ సీక్రెట్ సర్వేలో గుజరాత్‌లో ఆప్‌ తప్పకుండా గెలిచి తీరుతుందని తేలిందని వెల్లడించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి పర్యటిస్తున్న కేజ్రీవాల్...జునాగఢ్‌లోని కచ్‌ జిల్లాలో గాంధీధామ్ వద్ద రెండు భారీ ర్యాలీల్లో పాల్గొన్నారు. నర్మదా నీళ్లు కచ్‌ జిల్లాలోని ప్రతి మూలకు సరఫరా అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు.


ఉచిత, అపరిమిత వైద్యం అందిస్తామని, మందులూ ఫ్రీగానే ఇస్తామని చెప్పారు. వైద్యపరీక్షలు కూడా ఉచితంగా చేయటమే కాకుండా...ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా సర్జరీలూ చేయిస్తామని హామీ ఇచ్చారు.


Also Read: Delhi: కత్తులతో పొడుస్తుంటే కుర్చీ వేసుకుని చూసిన వ్యక్తి - వీడియో వైరల్!


Also Read: Rahul Gandhi on Gandhi Jayanti: మహాత్ముడి జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ శపథం!