MP Soyam Bapurao: ఆదివాసీల ఆరాధ్య దైవం, ఆదివాసీ పోరాట వీరుడు కుమురం భీం 82వ వర్ధంతి సందర్భంగా ఎంపీ సోయం బాపూరావు జోడేఘాట్ కు వెళ్లారు. కుమురం భీం మనుమడు కుమురం సోనేరావ్ తో కలిసి ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా నిర్వహించే కుమురం భీం వర్ధంతి సభలో అధికార పార్టీ నాయకులు హామీలు ఇవ్వడమే తప్ప ఏ ఒక్కటీ నెరవేర్చింది లేదని ఎంపీ సోయం బాపూరావు విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలు జల్, జంగల్, జమీన్ కోసం పోరాడుతూనే ఉన్నారని తెలిపారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంతోనే మంత్రి కేటీఆర్ జోడేఘాట్ పర్యటన రద్దు చేసుకున్నారని ఆరోపించారు.
గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి..
కేవలం కుమురం భీం స్మారక భారీ విగ్రహం, మ్యూజియం కడితే భివృద్ధి కాదని అన్నారు. ఏజెన్సీ గ్రామాల్లో రోడ్డు సౌకర్యం, డబుల్ బెడ్రూం ఇళ్లు, పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నాయని కుమురం భీం మనుమడు కుమురం సోనేరావ్ తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ ను జిల్లాగా చేశారే తప్ప ఇక్కడ గిరిజన యూనివర్సిటీ నెలకొల్పలేదని, అది వెరే ప్రాంతానికి తరలించారని ఆరోపించారు. ఆదివాసీల అభివృద్ధి జరగాలంటే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే ఎంపీ సోయం బాపూరావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు హాజరు కాలేదు. నివాళులర్పించిన అనంతరం తిరిగి ఆదిలాబాద్ పయనమయ్యారు.
మంత్రి ఇంద్రకరణ్ కు ఆదివాసీల ఘన స్వాగతం..
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో ఆదివాసీ పోరాట యోధుడు కుమురం భీం 82వ వర్ధంతి కార్యక్రమం ఆదివాసీ సాంప్రదాయాల మద్య ఘనంగా నిర్వహించారు. భీం వర్ధంతి సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి కేటిఆర్ రావాలసి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఆయన రాక రద్దయింది. జోడేఘాట్ కు హెలికాప్టర్ లో చేరుకున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆదివాసీలు సాంప్రదాయబద్దంగా.. గుస్సాడి నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. కుమురం భీం సమాధి వద్ద జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఉట్నూరు సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఎస్పీ సురేష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవ లక్ష్మి, శాసన మండలి సభ్యులు దండే విఠల్, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గాల శాసన సభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పలతో కలిసి మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. అపై అందరు భీం వర్ధంతి సభలో పాల్గొన్నారు.
త్వరలోనే హామీలు నెరవేరుస్తాం..
కుమురం భీం వర్ధంతి సభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. నిజాం పరిపాలనలో రైతుల సంక్షేమం కోసం వీరోచిత పోరాటం చేసిన కుమురం భీమ్ సేవలు మరువలేనివని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిందని గుర్తు చేశారు. కుమురం భీం జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. అమరుడు కుమురం భీం పోరాట ప్రదేశం జోడేఘాట్‌ను అన్ని హంగులతో అభివృద్ది చేయడం జరిగిందన్నారు. 25 కోట్ల రూపాయలతో గిరిజన మ్యూజియం, కుమురం భీం స్మారక చిహ్నం, స్మృతి వనం ఏర్పాటు చేసి.. భీం పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. త్వరలోనే రోడ్డు, రెండు పడక గదుల ఇళ్లు, ఆశ్రమ పాఠశాలల నిర్మాణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.