ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన మీదట అనతి కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను సీఎం ఆదేశానుసారం అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తూ, పల్లెపల్లెనా తెలంగాణ ప్రగతిని ఆవిష్కరింపజేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పరస్పర సహకారంతో పనిచేస్తూ దశాబ్ది ఉత్సవాల విజయవంతానికి అంకిత భావంతో కృషి చేయాలని వారిని కార్యోన్ముఖులు చేశారు. నిజామాబాద్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆదివారం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మేల్యే బిగాల గణేష్ గుప్తా, జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, రాష్ట్ర మహిళా సహకార అభివృద్ది సంస్థ చైర్ పర్సన్ ఆకుల లలిత, మేయర్ నీతూ కిరణ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, ఇంచార్జ్ సీ.పీ ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దశాబ్ది ఉత్సవ ఏర్పాట్లపై అధికారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు.


సమైక్య రాష్ట్రంలో వంచన, అనేక రకాల మోసాలకు గురైన తెలంగాణ సమాజం ప్రత్యేక రాష్ట్రం కోసం ఆరు దశాబ్దాలకు పైగా అలుపెరుగని పోరాటం చేసిందని మంత్రి గుర్తు చేశారు. 2001లో ఉద్యమ నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ మలిదశ తెలంగాణ పోరుకు శ్రీకారం చుట్టి, సబ్బండ వర్ణాలను ఏకం చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ కలను సాకారం చేశారని అన్నారు. ఆ సమయంలో తెలంగాణ సమాజాన్ని అనేక మంది గేలి చేశారని, పరిపాలన చేతకాదని, అంధకారం అలుముకుంటుందని తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా అవహేళన పర్చారని నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అయితే అనేక మంది యువకులు, విద్యార్థులు త్యాగాల పునాదులపై, ప్రజలందరి పోరాటంతో సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తన దార్శనిక పాలనతో కేవలం తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే యావత్ దేశం ఆశ్చర్యపోయే రీతిలో అనేక రంగాల్లో అభివృద్ధి చేశారని అన్నారు. 


ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అన్ని వర్గాల వారి కృషితో గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను పునఃశ్చరణ చేసుకుంటూ ప్రజలకు వీటి గురించి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను చేపడుతోందని అన్నారు. పండుగ వాతావరణంలో ఉత్సాహభరితంగా ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని మంత్రి సూచించారు.


ఉత్సవాల ప్రణాళిక ఇదీ
జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమం ఉంటుందని, 3న అన్ని రైతు వేదికల్లో రైతు దినోత్సవం జరపాలని, 4న పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దివస్, 5న విద్యుత్ విజయోత్సవం, 6న తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ కారక్రమాలను నిర్వహించాలని వివరించారు. 9న తెలంగాణ సంక్షేమ సంబరాలను, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవాన్ని, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్, 13న మహిళా సంక్షేమ దినోత్సవం, 14న తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం, 15న పల్లె ప్రగతి దినోత్సవం, 16న పట్టణ ప్రగతి దినోత్సవం, 17న తెలంగాణ గిరిజనోత్సవం, 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 20 న తెలంగాణ విద్యా దినోత్సవంలో భాగంగా అన్ని కళాశాలలు, పాఠశాలల్లో జెండాను ఎగురవేయాలని, విద్యాలయాలను అందంగా ముస్తాబు చేయాలని, విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేయాలని, వ్యాసరచన, వకృత్వ, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాలని అన్నారు. మన ఊరు - మన బడి పనులు పూర్తయిన చోట పాఠశాలలను ప్రజాప్రతినిధులచే  ప్రారంభోత్సవాలు చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 


21 న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం సందర్భంగా ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను అలంకరింపజేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు. 22 న అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంతం తరపున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అన్నారు.