తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కబోవని మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సహా గత ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. బీజేపీ నాయకులే పార్టీ మారేందుకు ఎదురుచూస్తున్నారంటూ హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే, బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ అని ఎద్దేవా చేశారు. మళ్లీ వారి పాలన కనుక వస్తే, ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని ఆరోపించారు.


కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఎల్లారెడ్డిలో రూ.15 కోట్లతో నిర్మించబోయే 100 పడకల ఆస్పత్రి భవనానికి హరీశ్ రావు భూమి పూజ చేశారు. తర్వాత గండిమాసాని పేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానాను కూడా హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే సురేందర్‌తో పాటు స్థానిక పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నాయని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలకు తిప్పికొట్టాలని ప్రజలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని బీజేపీ, కాంగ్రెస్‌లు వెనక్కులాగేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే, ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయని అన్నారు.



నిన్న మహబూబ్ నగర్‌లో పర్యటన


నిన్న (మే 27) మహబూబ్ ​నగర్ జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. ప్రకృతి వైపరిత్యాల కంటే దారుణంగా.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు తయారయ్యాయని హరీశ్ రావు ధ్వజమెత్తారు. వారి వైఖరి వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటూ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి దాదాపు 50 చోట్ల అభ్యర్థులు లేరని, కానీ ఆ పార్టీ నేతలు అధికారంలోకి వస్తామనే భ్రమల్లో ఉన్నారని అన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎక్కడా విఫలం కాలేదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఫెయిల్‌ అయిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. కానీ ప్రతిపక్షాలు కళ్లులేని కబోదుల్లా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఆచరిస్తే, దేశం అనుసరించేలా కేసీఆర్​ పాలన సాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ సహా గత ప్రభుత్వాల పాలనలో.. పాలమూరు జిల్లాకు కరవు, వలసలు, ఆకలి చావులు తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు. అలాంటి పాలన తిరిగి తీసుకొస్తామని, హస్తం నేతలు చెబుతున్నారని ఆరోపించారు.