బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో 7 కోట్ల 77 లక్షల వ్యయంతో కొత్తగా నిర్మించిన 112 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అర్హులైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసి, వారితో గృహ ప్రవేశం చేయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇండ్లు కాగితాల మీదనే ఉండేవని, కానీ కేసీఆర్ పేదల సొంతింటి కలను నేరవేర్చారన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలని, ఆయన వెంట ఉన్నోల్లంతా ప్రజల పైసలు జేబులవేసుకున్న దొంగలే అని వ్యాఖ్యానించారు. 


అనంతరం మోర్తాడ్ మండల కేంద్రంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోర్తాడ్ నుండి NH 16 వయా బద్దం వాడ రోడ్ రూ. 2.20 కోట్లతో ప్రత్యేక మరమ్మతులకు శంకుస్థాపన చేశారు. NH 16 నుండి బద్దం వాడ కమ్మర్పల్లి అప్రోచ్ రోడ్ రూ.1.60 కోట్లతో ప్రత్యేక మరమ్మతులు శంకుస్థాపన, ప్రత్యేక మరమ్మత్తులు. మోర్తాడ్ నుండి కమ్మర్పల్లి వయా వడ్యాట్ మోర్తాడ్ మండల లిమిట్ 45 లక్షలతో శంకుస్థాపన, మోర్తాడ్ పెద్దమ్మ గుడి వద్ద 15 లక్షలతో రిటైనింగ్ వాల్ మరమ్మత్తు పనులకు శంకుస్థాపనలు చేశారు. పేదవారి సొంతింటి కల నిజం చేయాలని ముఖ్యమంత్రి కేసిఆర్ పూర్తి ఉచితంగా డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తున్నారని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇలాంటి కార్యక్రమం దేశంలోనే మరెక్కడా లేదన్నారు. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా లబ్దిదారుల ఎంపిక పూర్తి పారర్శకతతో జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. 


తాను ఇచ్చిన పిలుపుతో బడా భీంగల్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కరు కూడా తమకు ఇల్లు కావాలని తనను అడగలేదని, పైగా అర్హులైన పేద వారికి అందేలా చూశారని అన్నారు. బిఆర్ఎస్ కుటుంబసభ్యుల క్రమ శిక్షణకు సెల్యూట్ అన్నారు. ఇంటి జాగా, వ్యవసాయ భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తామని తెలిపారు. సొంత ఇంటి జాగా ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే అర్హులైన పేదలకు త్వరలోనే రూ. 3లక్షల ఆర్ధిక సహాయం అందిస్తామన్నారు మంత్రి. బాల్కొండ నియోజకవర్గంలో 1500  ఇల్లు నిర్మించామని మరో 1500 త్వరలో నిర్మించి ఇస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో సొంత జాగా ఉండి అర్హులైన మరో 3వేల మందికి రూ. 3లక్షల చొప్పున ఇస్తామని తెలిపారు. ఇల్లు రాని వారు ఎవరు నిరాశ చెందొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు వస్తుందని అన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 


కాంగ్రెస్ హయాంలో కాగితాల మీదే ఇళ్ళు
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు వారి ప్రభుత్వ హయాంలో ఇండ్లు కాగితాల మీదనే ఉండేవని అన్నారు. లబ్దిదారుల పేరు మీద కాంగ్రెస్ నాయకులు వచ్చిన డబ్బులు జేబులో వేసుకునే వారని ఆరోపించారు. కానీ నేడు సీఎం కేసిఆర్ కట్టించిన ఇండ్లు కండ్ల ముందు కన్పిస్తున్నాయన్నారు. అప్పుడు కాంగ్రెస్ ఒక్క ఇంటికి సుమారు రూ. 75వేలు ఇస్తే.. ఇంటి జాగా ఖర్చు, అన్ని వసతులతో కలిపి కేసిఆర్ రూ. 10 లక్షల విలువగల ఇల్లు పేద ప్రజలకు ఇస్తున్నారని అన్నారు మంత్రి. గతంలో కాంగ్రెస్ నాయకులు వాళ్ల బంధువులకు ఇచ్చుకున్నరు.. కానీ నేడు ఏ పైరవీల ప్రమేయం లేకుండా అర్హులైన నిరుపేదలకు పూర్తి ఉచితంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఏవని విమర్శించిన రేవంత్ రెడ్డి బడా భీంగల్ వచ్చి చూడాలని సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డివి అన్ని దొంగ మాటలు ఆయన వెంట ఉన్నోల్లంతా ప్రజల పైసలు జేబులవేసుకున్న దొంగలే అని ఆరోపించారు. కేసిఆర్ ప్రభుత్వం కట్టించిన ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కాంగ్రెస్ కట్టించిన 10 ఇళ్లతో సమానమన్నారు.



కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మాటలు తప్పా.. రూపాయి సాయం చేయలేదన్నారు. బాల్కొండలో కట్టిన ప్రతి డబుల్ బెడ్రూం ఇల్లు సీఎం కేసీఆర్ ఇచ్చిన పైసలతో కట్టిందే.. బీజేపీ మోడీది రూపాయి కూడా లేదన్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద ప్రతి ఇంటికి 72వేల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సిఉండగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఒక్కో ఇంటి మీద సుమారు 10 లక్షలు కేసిఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. పసుపు బోర్డు పేరుతో రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసి ఎంపీ అయిన అరవింద్.. బాండ్ పేపర్ కున్న వాల్యూ పోగొట్టాడని ఎద్దేవా చేశారు. 
రైతుబంధును కాపీ కొట్టి ప్రవేశపెట్టిన ప్రధాని కిసాన్ సమ్మాన్ యోజన పథకం ప్రారంభంలో నిజామాబాద్ జిల్లాలోఎంత మందికి వచ్చింది. ఇప్పుడు ఎంత మందికి వస్తుందో.. ఎంపి అర్వింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు బంధు కింద కేసిఆర్ ఎకరానికి 10 వేలు ఇస్తున్నారని ఏటా లబ్ది దారుల సంఖ్య పెరుగుతోందని తెలిపారు. ప్రధాని కిసాన్ యోజన లబ్దిదారుల సంఖ్య తగ్గుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్,కెటిఆర్, కవితను తనను ఫేస్ బుక్ వేదికగా తరుచూ తిట్టే అరవింద్ అదే ఫేస్ బుక్ లో తన ప్రశ్నకు  సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ చేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. 
ప్రధాని మోదీ పాలన వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు అరిగోస పడుతున్నారని మండిపడ్డారు. తనకు అనుకూలమైన అదానీ లాంటి కార్పొరేట్ దోస్తులకు 12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలు మాఫీ చేశారనీ,ఆ మాఫీ చేసిన డబ్బులతో బీజేపీ ప్రత్యర్థి రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొంటూ అక్కడి ప్రభుత్వాలను కూలదోస్తున్నరని మండిపడ్డారు. మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కూలదోయాలని కుట్రలు చేస్తే కేసిఆర్ అడ్డు పడ్డారని అన్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు రెట్టింపు చేశారని దీంతో సామాన్యులపై అదనపు భారం పడుతుందన్నారు. పేదలను,రైతులను పీడిస్తూ...తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపదను దోచి పెడుతున్న మోడీని కేసిఆర్ ప్రశ్నిస్తున్నడని అందుకే మా సీఎంను కట్టడి చేయాలని ఆయన బిడ్డ ఎమ్మెల్సీ కవితమ్మను కేసుల పేరుతో వేధిస్తున్నరన్నారని ఆరోపించారు. లక్షల కోట్లు దోచుకున్న మోడీ దోస్త్ అదానీ మీద సమగ్ర విచారణ చేయాలని పార్లమెంట్లో ప్రతి ఎంపి డిమాండ్ చేస్తున్నాడని దానిపై ఎలాంటి స్పందనా లేదన్నారు. ఎల్ఐసి, ఎస్బిఐలో ప్రజల దాచుకున్న డబ్బులు మాయం చేసిన కుబేరుడు అదానీ మీద విచారణ చేయరు కానీ... సంబంధం లేని కేసులో కవితను విచారణ చేస్తున్నరని కేంద్ర ప్రభుత్వ కక్ష్య పూరిత వైఖరిపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.


రాష్ట్రంలో ప్రతి గడపకు కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరుతున్నాయని ఎవరు మంచి చేస్తున్నారో.. ఎవరు మాటలు చెప్తున్నారో విజ్ఞులైన ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు. రైతులు, పేద ప్రజల పక్షాన నిలబడ్డ కేసిఆర్ ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న కేంద్ర బీజేపీపై ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. అసత్య ప్రచారాలను తిప్పి కొట్టాలని కోరారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.