Adilabad News : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కుక్కలు స్వైర విహరం చేస్తున్నాయి. శనివారం కుక్కల దాడిలో 14  మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారికి  స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు 14 మందిని కుక్క కాటు వేయడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాలోను 9 మంది కుక్క కాటుకు గురవ్వగా.. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో 14 మంది కుక్క కాటుకు గురయ్యారు. గాయలైనవారిలో ఒకరు రెండేళ్ల చిన్నారి, ఆరో తరగతి విద్యార్థి,  ఆరవై ఏళ్ల వృద్ధురాలు ఉన్నారు. మిగతా వారంతా యువకులు ఉన్నారు. కుక్కల స్వైర విహారంతో జిల్లా వాసులు భయపడిపోతున్నారు. జిల్లాలో ఎక్కడ చూసిన వీధి కుక్కలు, ఒంటిపై చర్మం ఉడిపోయిన కుక్కులు కనిపిస్తున్నాయని, అధికారులు తగిన చర్యలు తీసుకొని వాటిని పట్టుకుని, ప్రజలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఇంద్రవెల్లిలో భట్టి విక్రమార్క యాత్ర శిబిరం సమీపంలో  ఇద్దరిని పిచ్చి కుక్క కరిచింది. వారిని ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.  


నిజామాబాద్ లో


నిజామాబాద్ జిల్లాలో ఇటీవల వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మెండోరా మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తూ గంట వ్యవధిలో 12 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. ఇద్దరికి కాళ్లకు, మరో నలుగురికి చేతికి, ఇద్దరికి ఛాతీపై, మరో ఇద్దరికి ఏకంగా ముఖం పై దాడి చేసి గాయపరిచాయి. మెండోరా మండల కేంద్రంలో హెల్త్ సెంటర్ ఉండటంతో వారిని అక్కడికి తరలించారు.  8 మందికి తీవ్రంగా గాయలయ్యాయని, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాని తెలిపారు. ఇద్దరికి సర్జరీ అవసరం ఉండొచ్చని డాక్టర్ తెలిపారు. మండల కేంద్రంలో కుక్కల దాడులను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులు 


నిజామాబాద్ జిల్లాలో గత మూడు నెలల్లో దాదాపు 300 మందికిపైగా వీధి కుక్కల కాటుకు గురయ్యారు. హైదరాబాద్ లో ఓ బాబు కుక్కల దాడిలో చనిపోయినా అధికారులు జిల్లాలో వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నటికి మొన్న కామారెడ్డిలో ఓ వృద్ధురాలిని కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. వృద్ధురాలు ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఇటీవల కాలంలో జిల్లాలో కుక్కల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి ఏటా శునకాలకు కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయాలి. కానీ ఎక్కడా అది జరగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల పరిధిలో నిజామాబాద్ నగర పాలక పరిధిలో కూడా కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కూడా విడుదల చేస్తున్నారు. ఆ నిధులు ఎటుపోతున్నాయో తెలియదు కాని శునకాల నియంత్రణలో అధికారులు మాత్రం ఏడాదికేడాది నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. 


వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి


ఖమ్మం జిల్లాలో వీధి కుక్కలు దాడి చేసిన ఘటనలో ఇటీవల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. రఘునాథపాలెం మండల పరిధిలోని పుటాని తండా గ్రామ పంచాయతీలో ఈ విషాదం జరిగింది. బానోతు రవీందర్, సంధ్య దంపతులకు చిన్న కుమారుడైన బానోతు భరత్(5) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అంతలో వీధి కుక్కలు భరత్ పై దాడి చేయగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ బాలుడికి స్థానికంగా ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రిఫర్ చేశారు డాక్టర్లు. వారి సూచన మేరకు బాలుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే బాలుడు మృతి చెందినట్లు సమాచారం. కుమారుడి మృత‌దేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటనతో స్థానికంగా ప్రజలలో వీధి కుక్కలపై భయాందోళన వ్యక్తమవుతోంది. అధికారులు స్పందించి తమ గ్రామంలో కుక్కల దాడులు జరగకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని, సాధ్యమైతే కుక్కలు లేకుండా చేయాలని స్థానికులు కోరుతున్నారు.