ప్రభుత్వ కార్యక్రమాలకు దాతల సహకారం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ దాత నిర్మించిన పాఠశాల భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో దాతలు భాగస్వామ్యమైతే రాష్ట్రం మరింత ప్రగతి పథంలో నడిపించవచ్చని కేటీఆర్ అన్నారు. కామారెడ్డిలో ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి దాదాపు రూ.6 కోట్లతో బీబీపేట్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన ప్రారంభాన్ని మంత్రి కేటీఆర్ చేశారు. కేటీఆర్‌తో పాటు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, దాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చొరవ తీసుకొని పెద్దమనసుతో సుభాష్‌రెడ్డి రూ.6 కోట్లతో ఇంత చక్కటి పాఠశాల నిర్మించినందుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సుభాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా కేటీఆర్ అభినందనలు తెలిపారు. పుట్టిన ప్రాంతం కోసం సుభాష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రులు ఈ సందర్భంగా కొనియాడారు. యావత్ తెలంగాణలోని పాఠశాలలకే ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రస్తుతం ఉన్న పాఠశాలలను బాగు చేస్తోందని, అలాగే దాతలు ముందుకొస్తే అద్భుతాలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సుభాష్ రెడ్డి నిర్మించిన పాఠశాల ఇంత గొప్పగా ఉందని తాను అనుకోలేదని కేటీఆర్ అన్నారు. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అందంగా ఉందని అన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మా నియోజకవర్గాల్లో కూడా స్కూళ్ల నిర్మానాలు చేపడతామని అన్నారు. సుభాష్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని.. అందరూ ముందుకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read : సుబ్బరామిరెడ్డి కంపెనీకి భారీ టోకరా.. నిందితులు అరెస్టు, అసలేం జరిగిందంటే..
రూ.6 కోట్లతో కార్పొరేట్ స్థాయిలో స్కూలు
ఇంటర్నేషనల్ స్కూళ్లను తలదన్నేలా బీబీపేట్ జడ్పీ ఉన్నత పాఠశాల భవన నిర్మాణం జరిగింది. రూ.6 కోట్లతో అన్ని రకాల అధునాత హంగులతో దీన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల భవన నిర్మాణం జరిగింది. మొత్తం 32 సువిశాల క్లాస్ రూంలు ఉన్నాయి. వీటిలో డిజిటల్ క్లాసులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశారు. లైబ్రరీ, అధునాతన రెస్ట్ రూంలు, నీటి శుద్ధి కేంద్రం, డైనింగ్ హాల్, ప్లే ఏరియా, ఉపాధ్యాయులకు స్టాఫ్ రూంలను ఏర్పాటు చేశారు.
Also Read: రాజకీయాల్లో నలిగిపోతున్న కామన్ మ్యాన్.. ‘దేశం’ అడుగుతోంది.. అసలు పట్టించుకోరా?