Harish Rao Nizamabad Visit: ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆస్పత్రి నిర్వహణ, పారిశుద్ధ్యం వంటి పనుల గురించి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న రోగులు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో మంత్రి మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న డైట్ ప్లాన్ గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు పూటలా భోజనం అందిస్తున్నారా? లేదా? అనే విషయాలను వాకబు చేశారు. రోగులకు తగినటువంటి పోషకాహారం అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో ఫార్మసీ లాబ్ సౌకర్యాలు గురించి తెలుసుకున్న మంత్రి హై ఎండ్ అల్ట్రా సౌండ్ మెషిన్ ఉన్నప్పటికీ టిఫా(టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ ఎనామిలీస్) స్కానింగ్ మెషిన్ అందుబాటులో లేదని చెప్పగా వెంటనే టిఫా స్కాన్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్న మంత్రి..
అదే విధంగా కిడ్నీ సంబంధిత పేషెంట్లు డయాలసిస్ సౌకర్యం లేనందు వలన నిజామాబాద్‌కి వెళ్లాల్సి వస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. దీంతో మంత్రి వెంటనే స్పందించి 10 రోజుల్లో ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీలనే చేయాలని మంత్రి వైద్య సిబ్బందికి సూచించారు. మంత్రి వెంట పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, వైద్య , ఆరోగ్య శాఖతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. ఆర్మూర్ వంద పడకల ఆస్పత్రిగా అప్ గ్రేడ్ అయిన తరువాత తొలిసారి సందర్శనకు వచ్చిన మంత్రి హరీష్ రావు ప్రతీ వార్డుకు వెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మీపట్ల డాక్టర్లు, సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటున్నదని మంత్రి అడగగా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారని పలువురు రోగులు చెప్పారు.
వైద్యులు, వైద్య సిబ్బంది భర్తీ చేస్తామని హామీ..
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ... వైద్యులు, వైద్య సిబ్బందితో సమీక్ష చేసి ఆసుపత్రికి కావాల్సిన తక్షణ సౌకర్యాల పై చర్చించారు. ఆర్మూర్ దవాఖాన నిర్వహణ అద్భుతంగా ఉందని మంత్రి కితాబు ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చొరవ వల్లే ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిగా మారిందన్నారు. జీవన్ రెడ్డి ఆర్మూర్ ఆసుపత్రికే తొలి ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక సాంకేతిక వైద్య సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు పేర్కొంటూ ఫలితంగా ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యాధునిక వైద్యం గ్రామగ్రామానికి చేరువైందన్నారు. ఆర్మూర్ ఆసుపత్రిలో మందుల కొరత లేదని, బయట ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి మందులు కొనాల్సిన పరిస్థితి లేదని ఆయన చెప్పారు. అతి త్వరలో ఈ ఆసుపత్రిలో సిబ్బందిని పెంచుతామని అన్ని విభాగాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
22 వేల 670 ఉచిత ప్రసవాలు...
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధను దృష్టిలో పెట్టుకొని ఈ ఆసుపత్రిలో మరిన్ని అత్యాధునిక వైద్య సౌకర్యాలు పెంచుతామని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా సకల వసతులు కల్పిస్తామని హరీష్ రావు ప్రకటించారు. ఆర్మూర్ ఆసుపత్రిలో ఉచిత ప్రసవాలు మరింత ప్రోత్సహించాలని మంత్రి వైద్య శాఖ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఇప్పటికే 22 వేల 670 ఉచిత ప్రసవాలు జరగడం అభినందనీయం అన్నారు. ఒక్క నవంబర్ లోనే 310 డెలివరీలు జరిగి ఆ తల్లుల కుటుంబాలకు దాదాపు ఒక కోటిన్నర రూపాయలు ఆదా కావడం హర్షణీయమని మంత్రి ప్రశంసించారు. ఇక నుంచి నెలకు 5 వందల ఫ్రీ డెలివరీలు జరిగేలా కృషి చేయాలని మంత్రి టార్గెట్ విధించారు. తమ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి స్పష్టం చేశారు. కార్పొరేట్ దవాఖానాలను తలదన్నేల ప్రభుత్వ వైద్య రంగాన్ని తీర్చిదిద్దనున్నట్లు మంత్రి హరీష్ రావు ఉద్ఘాటించారు. కాగా ఆసుపత్రిలో పలు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు.