Mancherial New: చంద్ర గ్రహణం చూస్తే అరిష్టమని నమ్మే దేశం చంద్రుడిపై ప్రయోగాల స్థాయికి ఎదిగింది. మెట్రో రైళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అందుబాటులోకి  వచ్చినా దేశంలో మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు. తెలంగాణలో వరుసగా క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. గోదావరి తీరాన తాంత్రిక పూజలు, మంత్ర తంత్రాలు అంటూ ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... మంచిర్యాల జిల్లా చెన్నూరు బొక్కలగూడెం కాలనీకి చెందిన దాసరి మధు(33) అనే యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుటుంబ సభ్యులు వివిధ ప్రాంతాల్లో చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. 


దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. మధుపై గిట్టని వారు తాంత్రిక ప్రయోగం చేశారని భావించిన కుటుంబ సభ్యులు ఓ మాంత్రికుడిని సంప్రదించారు. క్షుద్ర పూజలతోనే తమ కొడుకు అనారోగ్యానికి గురయ్యాడని అతని ఆరోగ్యం మెరుగుపడేందుకు పరచాలని ప్రాధేయపడ్డారు. వారి సూచనలతో తొలుత ఇంటి వద్ద పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మెడపై కోడిని తిప్పగా అది చనిపోయింది. దీంతో అతనిపై క్షుద్ర ప్రయోగం జరిగిందని, పెద్ద పూజలు చేయాలని తాంత్రికుడు చెప్పాడు.


ఆదివారం మేకతోపాటు పలు క్షుద్రపూజలకు సంబంధించిన సామగ్రితో మధును స్థానిక చెన్నూరు సమీపంలోని గోదావరి నది వద్దకు తీసుకెళ్లారు. చెట్లు, పొదల మధ్య తాంత్రిక పూజలు చేశారు. ఈ క్రమంలో మధుకు మాంత్రికుడు సాంబ్రాణి పొగ వేసి పైనుంచి దుప్పటి కప్పినట్లు తెలిసింది. దీంతో మధు అక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. కొద్ది సేపటికే అక్కడే మరణించాడు. సదరు మాంత్రికుడు పారిపోయాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. సాధారణ మరణం సంభవించినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు.  మధు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు సోమవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు గోదావరి నదికి తీసుకెళ్లారు. 


అప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ అయింది. అంతిమ సంస్కారం చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులపై తిరగబడ్డారు. చివరకు వారికి నచ్చజెప్పి యువకుడి మృతదేహానికి నది వద్దే పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహానికి అతడి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఘటనపై సీఐ వాసుదేవరావును సంప్రదించగా.. క్షుద్రపూజలతో మృతిచెందాడన్న సమాచారం మేరకు పోస్టుమార్టం చేయించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని వివరించారు. 


రెండు రోజుల క్రితం కాకతీయ వర్సిటీలో పూజలు
వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయంలో రెండు రోజుల క్రితం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ప్రతాపరుద్ర హాస్టల్ సమీపంలో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. క్షుద్రపూజలు జరిపిన ప్రాంతంలో నల్లకోడి, మేకను బలిచ్చారు. నిమ్మకాయలు, గుమ్మడి కాయలతో తాంత్రిక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన ప్రాంతంలో శత్రువు బొమ్మ, అదే విధంగా పూజా సామగ్రి కనిపించాయి. విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 


కాకతీయ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్‌గా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారని.. ముఖ్యంగా పౌర్ణమి - అమావాస్య తిథుల్లో గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళ తాంత్రిక పూజలు నిర్వహిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అయితే.. క్షుద్ర పూజలు జరిగిన ప్రాంతంలో పోలీసులు ఒక బైక్ గుర్తించారు. ఆ బైక్ ఆధారంగా ఎన్పీడీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి హస్తం ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఎందుకు యూనివర్సిటీ ఆవరణలో క్షుద్ర పూజ నిర్వహించారు. ఎవరు టార్గెట్‌గా క్షుద్రపూజలు చేశారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది. వీటిపై అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్థులు కోరుతున్నారు.