Farmers Hunger Strike: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడెం ఎత్తిపోతల పథకం ద్వారా కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దండేపల్లి మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. మంగళవారం రైతులతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సురేఖ సూచనల మేరకు ఆమరణ దీక్ష నిర్వహించారు. ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ముందస్తుగా ప్రకటిస్తే పోలీసులు అరెస్టు చేస్తారనే ఉద్దేశ్యంతో దీక్ష ఆరంభించిన అనంతరం ఆమరణ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.




గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తరచూ పైపు లైన్లు పగిలిపోయి పంటలకు నీరు అందడం లేదని అన్నారు. దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్ మండలాలకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ నాయకుడు గడ్డం త్రిమూర్తి అన్నారు. విధిలేని స్థితిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ఆయన తెలిపారు. అధికారులు, పాలకుల అలసత్వం వల్లనే రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి జడ్పిటీసీ గడ్డం నాగరాణి, ఎంపిటిసిలు, లక్షెట్టిపేట, హాజిపూర్, మంచిర్యాల, నస్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.