మంచిర్యాల: శతాబ్ద కాలంగా కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్లుగా తీసుకొచ్చి వాటి అమలుకు నిరసనగా వచ్చే జులై 9న సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్లు సింగరేణి గుర్తింపు సంఘం, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు.


మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్మిక సంఘాల జేఏసీ నాయకులతో కలిసి ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడారు. దేశవ్యాప్తంగా 4 లేబర్‌ కోడ్లను అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుందన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19(1)సీ, ఆర్టికల్‌ 21, 24, 39(డీ)కి విరుద్ధమైన కోడ్స్​‍ అమలు జరిగితే కార్మికులు ఉద్యోగ భద్రత, ఉపాధి కోల్పోతారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న జరిగే సమ్మెలో సింగరేణిలో పనిచేసే కార్మికులు, సంఘటిత సంఘటితరంగా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి, టీబీజీకేఏస్, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.