Kumuram Bheem Asifabad District  ఆసిఫాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఎమ్మెల్యే కోవలక్ష్మి నీచ రాజకీయలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రతినిధిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటన్నారు. కుమ్రం భీం ఆసిపాబాద్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు సీతక్క వస్తే ఎమ్మెల్యే కోవలక్ష్మి స్వాగతించాలి. కానీ ఒక మహిళ అయి ఉండి, మంత్రి సీతక్కని కించపరచడం మొత్తం మహిళల్ని అవమానపరచడమే అన్నారు.


ఆసిఫాబాద్ జిల్లా అభివృది కొరకు పలుమార్లు మంత్రి సీతక్క ఇక్కడికి వస్తే.. స్థానిక బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ప్రజల సమస్యలను విస్మరించి, కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతూ పర్సంటేజీల మంత్రులుగా కొనసాగారని ఆరోపించారు. ఆదివాసి బిడ్డగా ఆదివాసుల కోసం తపించే మంత్రి సీతక్కపై పిచ్చికూతలు కూయటం మానుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నేతలపై, కార్యకర్తలపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు. ప్రజలు కోరుకున్న ప్రజా ప్రభుత్వంపై పనికిమాలిన విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమికొడతారని గుర్తుంచుకోవాలన్నారు. 


ప్రొటోకాల్ కోసమంటూ రాజకీయం చచేయడం సిగ్గుచేటు అని, ప్రజల అభివృద్ధిని అడ్డుకొవాలని చూస్తే ఖబర్దార్ అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆమె మీద తిరుగుబడే వరకు తెచ్చుకోవద్దు అని కోవ లక్ష్మీని ఆత్రం సుగుణ హెచ్చరించారు. తాము పోరాటంతో రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజల బాధలు, కన్నీళ్లు తెలుసనన్నారు. అందుకే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రతి గూడెం, పల్లె, ఊరు వాడ.. తిరుగుతూ గ్రామాల్లో ప్రజలకు అభివృద్ది ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఆత్రం సుగుణ చెప్పారు. 


ఎమ్మెల్యే కోవలక్ష్మి దిష్టిబొమ్మ దగ్ధం
కుమ్రం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావుపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే కోవలక్ష్మి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మీ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని లేకపోతే ఆమె ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం విశ్వప్రసాద్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోవలక్ష్మిపై చర్యలు తీసుకొని పోలీసులకు పిర్యాదు చేశారు.