Khanapur MLA Rekha Naik: మారుమూల గ్రామాలలో నెలకొన్న సమస్యలు తెలుసుకుంటూ ఆ గ్రామస్తుల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్ పూర్ గ్రామాన్ని సందర్శించారు. గోపాల్ గ్రామానికి వెళ్ళాలంటే దారి సరిగ్గా లేదు.. అసలే అది అటవీ ప్రాంతం. అందులోనూ రోడ్డంతా గుంతలమయంగా ఉంటుంది. మట్టి రోడ్డులో ప్రయాణిస్తున్నా.. మధ్య మధ్యలో వాగులు, వంకలు అడ్డు తగులుతుంటాయి. ప్రయాణానికి ఆటంకం కలిగిస్తాయి. భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో తెప్పలో ప్రయాణించి వరద బాధితులను, ముంపు ప్రాంతాల వారిని కలుసుకున్న ఎమ్మెల్యే రేఖా నాయక్, తాజాగా ట్రాక్టర్ లో ప్రయాణించి అడవి బిడ్డలను కలుసుకుని, వారి సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధుల పయనం..
గుంతల మయమైన మట్టి రోడ్డు, పైగా భారీ వర్షాలతో రోడ్డు మరింత అద్వానంగా తయారైంది. ఈ రోడ్డు పై కారు వెళ్లేందుకు కూడా అంతగా వీలుపడతు. దీంతో ఎమ్మెల్యే రేఖా నాయక్ (Khanapur MLA Rekha Naik) గ్రామంలోని ఓ ట్రాక్టర్లో తమ కార్యకర్తలతో ప్రయాణించి గోపాల్ పూర్ గ్రామానికి వెళ్లారు. గోపాల్ పూర్ గ్రామస్తులతో కలిసి పలు విధులను సందర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రోడ్డు సౌకర్యం లేక గర్భిణీలు, బడికి వెళ్ళే విద్యార్థులు, గ్రామ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర సమయంలో 108 కూడా రాలేని పరిస్థితి నెలకొందని, గ్రామస్తులు ఎమ్మెల్యే రేఖా నాయక్ దృష్టికి తీసుకొచ్చారు.
అడవి బిడ్డల జీవన విధానం కాస్త భిన్నమే..
పల్లెటూరి వాతావరణం వేరని ఇలాంటి పచ్చని అడవిలో అందమైన పల్లెల్లో అడవి బిడ్డలు ఉండే విధానం వారి సంస్కృతి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ ను గ్రామస్తులు శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే భోజనం చేశారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోపాల్ పూర్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మౌళిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు.
Also Read: Rains in AP Telangana: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నేడు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు IMD ఎల్లో అలర్ట్ జారీ
నిధులు తెప్పించి రోడ్లు వేయించేందుకు ఎమ్మెల్యే తాపత్రయం..
గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వసతులతో కూడిన అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం దశ దిశ కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. త్వరలో గోపాల్ పూర్ కు రహదారిని బాగు చేసి ప్రజలకు సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు. రోడ్లు బాగోలేకున్నా, తమ పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి, ఉన్నతాధికారులు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకు గ్రామానికి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ప్రాంతానికి సరైన రోడ్డు సౌకర్యం కల్పిస్తారని, మరిన్ని సమస్యలు పరిష్కారం చేస్తారని ఆకాంక్షించారు.
Also Read: Telangana Loans : "అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్