Keslapur Nagoba Temple: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ నాగోబా ఆలయంలో బుధవారం మెస్రం వంశీయులు సమావేశమై నూతన ఆలయ కమిటీ చైర్మెన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయ కమిటీ నూతన చైర్మెన్ గా మెస్రం తుకారాం ను ఎన్నుకున్నారు. ఈ చైర్మెన్ పదవి కాలం 1 సంవత్సరం పాటు ఉంటుందని మెస్రం వంశీయులు తెలిపారు. కెస్లాపూర్ గ్రామంలో కొలువైన ఆదివాసీల ఆరాధ్య దైవం నూతన నాగోబా ఆలయాన్ని ఇటివలే ప్రారంభించిన మెస్రం వంశీయులు జనవరి 21వ తేదీన ప్రారంభం కానున్న నాగోబా జాతర కు సిద్దమయ్యారు. 
ఈ 21న నాగోబాకు పవిత్ర జలంతో అభిషేకం
గత నెల 26న ఎడ్లబండి ఛకడా వాహనంలో నాగోబా జాతర ప్రచారం నిర్వహించి.. జనవరి 1న పవిత్ర గంగాజలం కోసం హస్తలమడుగుకు కాలినకడన పయనమయ్యారు. పదో తేదిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని గోదావరినది సమీపంలో గల హస్తలమడుగు వద్దకు చేరుకొని పవిత్ర జలాన్ని సేకరించి తిరిగి ఈ నెల 17వ తేదిన ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు చేసి కేస్లాపూర్ చేరుకోనున్నారు. ఈ నెల 21న నాగోబాకు పవిత్ర జలంతో అభిషేకం చేసి ప్రత్యేక పూజల నడుమ జాతర ప్రారంభం కానుంది. 
జాతరకు ముందుగానే ఆలయ కమిటీ చైర్మెన్ ఎన్నిక
నాగోబా జాతరకు ముందుగానే ఆలయ కమిటీ చైర్మెన్ గా మెస్రం తుకారాం ను బుధవారం మెస్రం వంశీయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్, మెస్రం వంశ పెద్దలు మెస్రం చిన్నుపటేల్, మెస్రం బాధిరావ్ పటేల్, మెస్రం కోసు కటోడ, మెస్రం హనుమంతు కటోడ, మెస్రం దేవురావ్, మెస్రం లింబారావ్, మెస్రం సోనేరావ్, మెస్రం నాగనాథ్, మెస్రం ఆనంద్ రావ్, మెస్రం నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు.


కేస్లాపూర్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ఆదివారం రాత్రి ఇంద్రవెల్లి మండలంలోని పిట్టబొంగరంలో బస చేసుకొని, తిరిగి ఉదయం సోమవారం ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ లో, జనవరి 3న గాదిగూడ మండలంలోని లోకారి, జనవరి 4న గాదిగూడ మండలంలోని బోడ్డిగూడ, జనవరి 5న గాదిగూడ మండలంలోని గణేష్ పూర్, జనవరి 6న కుమ్రం భీం జిల్లాలోని జైనూరు మండలంలోని లేండిజాల, జనవరి 7న జైనూరు, జనవరి 8న లింగాపూర్ మండలంలోని ఘుమ్నూరు, జనవరి 9న మంచిర్యాల జిల్లా దస్తురాబాద్ మండలంలోని మల్లాపూర్‌, జనవరి 10న జన్నారం మండలం గోదావరి హస్తిలమడుగు వద్దకు చేరుకుంటామని వివరించారు. జనవరి 10 వ తేదిన హస్తలమడుగులో గోదావరమ్మకు పూజలు నిర్వహించి పవిత్ర జలం సేకరిస్తామన్నారు. అనంతరం అక్కడ నుండి తిరుగు పయనంలో ఉట్నూర్‌ బస, జనవరి 11న దోడందా, జనవరి 12 నుంచి 16 వరకు పాదయాత్ర విశ్రాంతి చేపట్టి జాతరకు బయలుదేరేందుకు సిద్దమవుతారు. 


మర్రి చెట్టు వద్ద మూడు రోజుల పాటు బస చేశాక 21న ఆలయ సమపంలోని గోవాడకు చేరుకొని అదేరోజు అర్ధరాత్రి నాగోబాకు పవిత్ర జలాభిషేకం చేసి మహాపూజ చేస్తామన్నారు. ఆ రోజు నుండి నాగోబా జాతర ప్రారంభమువుతుందని మెస్రం వంశీయులు తెలిపారు.